దేశానికి దిక్సూచిగా మారిన తెలంగాణ

రైతుబంధు కార్యక్రమంలో చారిత్రాత్మకం
చెక్కుల పంపిణీలో నిజామాబాద్‌ ఎంపి కవిత
నిజామాబాద్‌,మే11(జ‌నం సాక్షి ): అభివృద్ధి, సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందని ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ నియోజకవర్గంలోని మామిడిపల్లి గ్రామంలో రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో మొత్తం 14 వేల మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ చరిత్రలో ఎన్నడూ లేని వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఆమె అన్నారు.
తెలంగాణకు దసరా పండుగ ఎంత గొప్పదో రైతులకు రైతుబంధు పథకం అమలవుతున్న ఈ రోజు అంతగొప్ప పండుగని కవిత అభిప్రాయపడ్డారు. పల్లెలు బాగుండాలంటే వ్యవసాయం బాగుండాలని ముఖ్యమంత్రి గుర్తించారనీ, వ్యవసాయాన్ని బాగు చేసేందుకే పంట పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించారని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.42 కోట్ల ఎకరాల భూమికి, దాదాపు 58లక్షల మంది రైతులకు ఏటా రూ.12వేల కోట్ల పంట సాయం అందించాలని నిర్ణయించారన్నారు. ఎకరాకు
రూ.8వేల చొప్పున ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందించడం ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదనీ, ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయమన్నారు. ఏ లక్ష్యాల సాధన కోసం తెలంగాణను సాధించుకున్నామో, వాటిని ఒక్కొక్కటిగా సాధిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తొలి ఏడాది విద్యుత్‌ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామనీ, బోర్లపై ఆధారపడిన మన ప్రాంతంలోసేద్యాన్ని కాపాడుకునేందుకు ఎక్కువ డబ్బు ఖర్చు చేసైనా విద్యుత్‌ కొనుగోలు చేశామనీ, దీంతో ఇప్పుడు తెలంగాణ కడుపు నిండా కరెంట్‌ వస్తున్న దన్నారు. రెండో ఏడాది రైతులకు సాగునీరందించాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్‌ రూపకల్పన చేశారన్నారు. దీనితో 31 జిల్లాలకు సాగు, తాగునీరు అందుతుందన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో కేవలం 4లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు మాత్రమే ఉన్నాయనీ, రాష్ట్రం వచ్చిన తర్వాత 18లక్షల మెట్రిక్‌ టన్నల సామర్థ్యం కలిగిన గోదాములను నిర్మించామనీ, ఇప్పుడు
రాష్ట్రంలో 22లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు పురుడు పోసుకొని ఉద్యమించేవనీ, తొలిసారిగా ప్రభుత్వమే రైతు సంఘాలను స్థాపించిందని గుర్తుచేశారు. ఇది ముఖ్యమంత్రి సాహసోపేత, విప్లవాత్మక నిర్ణయమన్నారు. గత ప్రభుత్వాల పాలకులంతా రైతులకు మేలు చేస్తున్నామంటూ, తలపాగాలు చుట్టి, తట్టలు నెత్తికి ఎత్తుకొని ఫొటోలకు పోజులిచ్చేవారనీ, టీఆర్‌ఎస్‌ మాత్రం అలా కాదనీ, రైతుల మేలు కోసం సేద్యాన్ని పండుగలా చేసి, తిరిగి ప్లలెలను పచ్చగా, స్వయం పోషకాలుగా మార్చేందుకు నిరంతరం తపిస్తున్న ప్రభుత్వమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవితతో పాటు ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి, కలెక్టర్‌ రామ్మోహన్‌ రావుతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.