దేశాన్ని వణికించిన భూకంపం
ఖాట్మండ్ లో భూకంప తీవ్రత 7.5గా నమోదు
ఖాట్మండ్ లో కూలిన పాత భవనాలు, పలు ఇండ్లు, పురాతన కట్టడాలు
నిలిచిన మొబైల్ సేవలు, రవాణా వ్యవస్థ
వంద మంది మృతి
శిథిలాల కింద వందల మంది!
ఉత్తర, ఈశాన్య భారత్‌ను వణికించిన భూకంపం
భారత్ లో ముగ్గురు మృతి
ఢిల్లీలో భూకంప తీవ్రత 5గా నమోదు
ఖాట్మండ్ లో 25 మంది తెలుగు భక్తులు సురక్షితం
న్యూఢిల్లీ : నేపాల్ రాజధాని ఖాట్మండ్‌తో పాటు సరిహద్దు దేశమైన భారత్‌ను భూకంపం వణికించింది. ఖాట్మండ్ ను కకావికలం చేసిన భూకంపం ఉత్తరాది, ఈశాన్య భారత్‌లోనూ సంభవించింది. భూకంపంతో ఖాట్మండ్ కకావికలమైంది. వందల మంది మృతి చెందారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. ఖాట్మండ్ ఆస్పత్రులన్ని క్షతగాత్రులతో నిండిపోయాయి. దేశంలోని బీహార్, యూపీ రాష్ర్టాలు భూకంపంతో గజగజ వణికిపోయాయి. ఈ రెండు రాష్ర్టాల్లో ముగ్గురు మృతి చెందారు. అయోధ్యలోని కామాఖ్య ఆలయం పైకప్పు కూలిపోయింది. పలు చోట్ల భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. భూకంపం సంభవించిన సమయంలో ఆఫీసులు, ఇండ్లలో ఉన్న జనాలు భయంతో బయటకు పరుగులు తీశారు.
ఈ ఉదయం 11.42 గంటలకు నేపాల్‌లోని లామ్‌జంగ్‌లో భూకంపం చోటు చేసుకుంది. భూకంపం నేపాల్‌పై తీవ్ర ప్రభావం చూపింది. నేపాల్‌లోని భరత్‌పూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదైంది. భూమిలోని 10 కిలోమీటర్ల లోతులో భూకంపం చోటు చేసుకుంది. నిమిషం 8 సెకన్ల పాటు భూమి కంపించింది. నేపాల్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
భూకంప ధాటికి ఖాట్మండ్‌లోని పాత భవనాలు, ఇండ్లు, పురాతన కట్టడాలు, హిందూ దేవాలయాలు కూలిపోయాయి. హిందూ దేవాలయం శిథిలాల కింద 500 మంది ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఖాట్మండ్‌లో ముగ్గురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో 15 ఏళ్ల బాలిక ఉంది. ఖాట్మండ్‌లో చారిత్రక కట్టడం ధరహారా టవర్ కూలిపోయింది. టవర్ కింద 50 మంది చిక్కుకున్నారు. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీస్తున్నారు. క్షతగాత్రులతో ఖాట్మండ్ ఆస్పత్రులు నిండిపోయాయి. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ఖాట్మండ్ ఎయిర్‌పోర్టు పాక్షికంగా ధ్వంసమైంది. ఎయిర్ పోర్టును మూసివేశారు. భారత్ నుంచి నేపాల్ కు విమానాలను నిలిపివేశారు. ఇతర ప్రాంతాల నుంచి నేపాల్‌కు వెళ్లే విమానాలన్నింటిని ఇండియాకు మళ్లించారు. నేపాల్‌లో మొబైల్ సేవలు నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థ, ఇంటర్నెట్, విద్యుత్ వ్యవస్థ నిలిచిపోయింది.
రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పాత ఖాట్మండ్‌లోని హనుమాన్‌డోకపై భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. భూకంప ప్రాంతంలోనే వరుసగా భూప్రకంపనలు నమోదు అవుతున్నాయి. నేపాల్‌లోని కొడారి ప్రాంతంలో 5.1 తీవ్రతతో మరోసారి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కీర్తిపూర్‌కు 69 కిలోమీటర్ల దూరంలో మరో ప్రకంపన చోటు చేసుకుంది. తీవ్రత 6.6గా నమోదైంది.
ఉత్తర, ఈశాన్య రాష్ర్టాల్లో భూకంపం
ఉత్తర, ఈశాన్య రాష్ర్టాల్లోనూ భూకంపం సంభవించింది. కశ్మీర్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలో భూకంప తీవ్రత 5గా నమోదైంది. ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఛత్తీస్‌గఢ్, బీహార్, కోల్‌కతా, లక్నో, కేరళ, కొచ్చి, పంజాబ్, హర్యాణా, ఉత్తరాఖాండ్, రాజస్థాన్, జార్ఖండ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల భూకంపం వచ్చింది. నేపాల్ సరిహద్దులో ఉన్న యూపీ, బీహార్ సీఎంలతో మోడీ ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు.
ఇప్పుడొచ్చింది పెద్ద భూకంపమే
ఇవాళ వచ్చిన భూకంపం పెద్ద భూకంపమేనని ఐఎండీ స్పష్టం చేసింది. దూరం పెరిగేకొద్ది ప్రకంపనల తీవ్రత తగ్గుతుందని తెలిపింది. ఢిల్లీలో భూకంప తీవ్రత రిక్టర్‌స్కేలుపై 5గా నమోదైందని తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతం, సిక్కిం, బెంగాల్ పలు ప్రాంతాల్లో భూకంప ప్రభావం ఉందని పేర్కొంది.
1934లో ఇలాంటి ప్రకంపనలు
1934లో బీహార్‌లో ఇలాంటి ప్రకంపనలు వచ్చాయని శాస్త్రవేత్త పూర్ణచందర్‌రావు తెలిపారు. కాశ్మీర్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు భూకంప ప్రభావం ఉందని స్పష్టం చేశారు. నేపాల్‌లోని పలు పట్టణాలపై భూకంప ప్రభావం ఉందని పేర్కొన్నారు. మున్ముందు పెద్ద భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వాటిని తట్టుకునే విధంగా ఇండ్లు నిర్మించుకోవాలని సూచించారు.
ఖాట్మండ్‌లో 25 మంది తెలుగు భక్తులు
ఖాట్మండ్‌లో భూకంపం కకావికలం సృష్టించింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. భూకంపం వచ్చిన సమయంలో సుమారు 25 మంది తెలుగు భక్తులు ఖాట్మండ్‌లో ఉన్నారు. ఆ సమయంలో వీరు ఓ హాటల్‌లో బస చేస్తున్నారు. భూకంప తీవ్రతను చూసి భక్తులు బయటకు పరుగులు తీశారు. భక్తులకు సురక్షితంగా బయటపడ్డారు. ఈ భక్తులంతా హైదరాబాద్‌కు చెందిన వారు.