దేశ‌వ్యాప్తంగా ఫ్లూజ్వరాలు – ఇబ్బందులు పడుతున్న ప్ర‌జ‌లు

obwngsiiఆర్థికంగా ఎంత పుంజుకుంటే ఏం లాభం? అభివృద్ధిలో ఎంత పురోగమిస్తే ఏం ప్రయోజనం? దేశ భవిష్యత్తు అయిన పిల్లల్లో సగం మందికి పైగా పోషకాహార లోపంతో చావుకు దగ్గరవుతున్నారు. పౌష్టికాహార లోపాన్ని తరిమికొట్టాలని నిర్ణయించి రెండు దశాబ్దాలు గడిచినా పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. దేశంలోని ఐదేళ్లలోపు చిన్నారుల్లో 46శాతం మంది వయసుకు తగ్గ బరువులేరు. 48శాతం మందిలో వయస్సుకు తగ్గ ఎదుగుదల లేదు. ఇవన్నీ ఏవో కాకిలెక్కలు కాదు. ప్రభుత్వం అంగీకరించిన సత్యాలు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే.. ఇప్పటికీ మగ పిల్లలకు ఇచ్చేంత పోషకాహారం ఆడపిల్లలకు ఇవ్వకపోవడం. సాధారణంగా పూర్తి ఆరోగ్యంతో ఉన్న ఐదు నెలల చిన్నారి ఉండాల్సిన బరువు ఐదు కిలోలు. కానీ దేశంలో సగం మంది రెండేళ్ల చిన్నారులు ఆ బరువు తూగుతున్నరంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 30లక్షల మంది పోషకాహార లోపంతో చనిపోతున్నారు. అందులో సగం మంది చిన్న చిన్న జబ్బులకే ప్రాణాలు వదులుతున్నారు. కారణం పోషకాహార లోపంతో రోగనిరోధక శక్తి తగ్గడం. పౌష్టికాహారం అందని పిల్లల్లో ఎదుగుదల లోపం స్పష్టంగా కనిపిస్తుంది. తల్లి గర్భంలో ఉండగానే మాల్‌న్యూట్రీషన్‌ కు లోనవుతున్న పిల్లలు ఎందరో. బాల్య వివాహాలు ఇందుకు కారణమవుతున్నాయి. దేశంలో దాదాపు 47శాతం మంది ఆడపిల్లలకు 18ఏళ్ల లోపే పెళ్లిళ్లు చేస్తున్నారు. చిన్న వయసులో తల్లికావడంతో గర్భస్థ దశలో పిల్లలకు సరైన పోషకాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కడుపునిండా తిండి.. ఒళ్లు దాచుకోవడానికి బట్ట.. నీడ కోసం గూడు ఈ మూడుంటే చాలు జీవితం సాఫీగా గడిచిపోతుందని అనుకునేవాళ్లు చాలా మందే ఉంటారు. కానీ ఈ మూడు లేనివారు దేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. అన్నమో రామచంద్రా అంటూ అలమటిస్తున్నారు. భారత్‌లో ఆకలి కేకలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయో ఐక్యరాజ్యసమితి నివేదిక కళ్లకు కట్టింది. ప్రపంచంలోనే ఆకలితో అలమటిస్తున్న రాజ్యాల్లో భారత్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంది. యునైటెడ్‌ నేషన్స్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ నివేదిక ఇదే చెబుతోంది. ద స్టేట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ఇన్‌సెక్యూరిటీ ఇన్‌ ద వల్డ్‌ 2015 పేరుతో UNFAO రూపొందించిన నివేదిక ప్రకారం భారత్‌లో దాదాపు 19కోట్ల 40లక్షల మంది ఆకలితో మలమలమాడుతున్నారు. మూడు పూటల మాట దేవుడెరుగు కనీసం ఒక్క పూట కూడా కడుపు నింపుకోలేకపోతున్నారట. ఇక భారత్‌ తర్వాతి స్థానం చైనాదే. అక్కడ దాదాపు 13కోట్ల మంది తిండికి నోచుకోవడంలేదు. ప్రపంచదేశాలన్నింటిలో సుమారు 79కోట్ల 50లక్షల మంది అన్నం కోసం అలమటిస్తున్నారని నివేదిక స్పష్టం చేసింది. నిజానికి గత ఇరవై ఏళ్లతో పోలిస్తే ఈ సంఖ్య చాలా వరకు తగ్గింది. రెండు దశాబ్దాల్లో భారత్‌లోనూ దారిద్ర్యం తగ్గినా ఆకలితో అలమటిస్తున్న రాజ్యాల్లో టాప్‌ ప్లేస్‌లో నిలవడం మన దురదృష్టం.

ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న వారు వంద మందుంటే అందులో 25మంది భారత్‌లోనే ఉన్నారు. 21వ శతాబ్దం ఆరంభంలో ఇండియా సాధించిన జీడీపీ వృద్ధి పేదలకు ఏ మాత్రం మేలు చేయలేకపోయింది. దేశ జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే ఇండియా పాపులేషన్‌లో మాల్‌ న్యూట్రిషన్‌ బాధితుల నిష్పత్తి 15.2శాతం. చైనాలో అది 9.3శాతంగా ఉంది. 1990 నుంచి ఇండియా, చైనాలు జీడీపీలో వృద్ధి నమోదు చేస్తున్నా అది కేవలం ధనిక వర్గాలకే పరిమితమైంది తప్ప ప్రజలందరికీ చేరలేదు. UNO ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు నిర్దేశించుకున్న మిలీనియం డెవలప్‌మెంట్‌ గోల్స్‌ గానీ వాల్డ్‌ ఫుడ్‌ సమ్మిట్‌ లక్ష్యాలను గానీ అందుకోవడంతో భారత్‌ ఘోరంగా విఫలమైంది.

పోషకాహార లోపం అనేది కేవలం ఒకరి ఆరోగ్యపరమైన సమస్య మాత్రమే కాదు. దాని సైడ్‌ ఎఫెక్ట్స్‌ చాలానే ఉన్నాయి. వ్యక్తి, కుటుంబం పైనే కాదు సమాజంపైనా దాని దుష్ప్రభావం ఉంటుంది. ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తుంది. మాల్‌ న్యూట్రీషన్‌ కారణంగా వ్యక్తుల శారీరక శ్రమ తగ్గడంతో సంపాదన తగ్గుతుంది. ఫలితం పేదరికం పెరుగుతుంది. పోషకాల లోపం పల్ల రోగ నిరోధక శక్తి తగ్గి అంటురోగాలు త్వరగా వ్యాపిస్తాయి. పిల్లల చదువుపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 11శాతం రోగాలకు పౌష్టికాహారలోపం కారణమని వాల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ రిపోర్ట్‌ చెబుతోంది.

పిల్లల పౌష్టికాహార లోపానికి చాలా కారణాలే ఉన్నాయి. తల్లుల విద్యాస్థాయి, పోషకాహారం గురించి అవగాహన లేకపోవడం, కుటుంబ ఆర్థికస్థితి, తల్లిపాలు పట్టకపోవడం వంటివి పిల్లలపై ప్రభావం చూపుతాయి. మాల్‌న్యూట్రీషన్‌కు లోనయ్యే వారిలోనూ అణగారిన వర్గాల ప్రజలే ముందున్నారు. దేశంలో ఇతర కులాల పిల్లలతో పోలిస్తే షెడ్యూల్‌ కులాలు, తెగల పిల్లల్లో తక్కువ బరువున్న పిల్లలు 14 నుంచి 20 శాతం వరకు ఎక్కువగా ఉన్నారు. ముస్లిం పిల్లల్లోనూ మాల్‌ న్యూట్రీషన్‌ సమస్య తీవ్రంగా ఉంది. ఇక ఆకాశంలో సగం అవకాశాల్లో సగమంటూ మహిళలు అన్నిరంగాల్లోనూ దూసుకుపోతున్నా వారికిచ్చే ఆహారం విషయంలో ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఫలితంగా పోషకలోపంతో బాధపడే మగ పిల్లలతో కన్నా ఆడపిల్లల సంఖ్యే ఎక్కువ ఉంటోంది.

పౌష్టికాహార లోపానికి గురైన పిల్లలు శారీరకంగానే కాదు… మానసికంగానూ సమస్యలు ఎదుర్కొంటారు. వీరిలో ఎదుగుదల లోపిస్తుంది. విషయాలను అర్థం చేసుకునే శక్తి లోపిస్తుంది. బరువు తక్కువున్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల తరుచూ జబ్బు పడుతుంటారు. ఇలాంటి పిల్లల్లో ముఖ్యంగా విటమిన్‌ A, ఐరన్‌, కాల్షియం, అయొడిన్‌లాంటి పోషక పదార్థాల లోపం ఏర్పడుతుంది. పిల్లల్లో షోషకాహార లోపాన్ని తల్లిదండ్రులు ఈజీగానే గుర్తించొచ్చు. అదే వయసుగల పిల్లలతో పోలిస్తే వారు వయసుకు తగ్గ బరువు, ఎత్తు ఉండరు. తీవ్ర పోషకాహార లోపం గల పిల్లలపై దృష్టి సారించకపోతే… టీబీ, నిమోనియాతో పాటు ఇతర శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. చర్మం గరుకుగా మారుతుంది. చర్మం పొక్కులు లేస్తుంది. జుట్టు దాదాపు ఊడిపోతుంది. ఈ లక్షణాలను వీలైనంత తొందరగా గుర్తించి వారి పట్ల తగిన శ్రద్ధ తీసుకోకపోతే పరిస్థితి తీవ్రంగా మారుతుంది. అందుకే ఇలాంటి పిల్లలకు రెట్టింపు ఆహారం ఇవ్వాలి. తీవ్ర పోషక లోపం గల పిల్లల బరువు కన్నా స్వల్ప లోపానికి గురైన పిల్లల బరువు పెంచడం సులభం. అందుకే ప్రాథమిక దశలోనే లోపాన్ని గుర్తించి దాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలి.
పోషకాహార లోపాలున్న పిల్లులు ఎక్కువగా ఉండటం దేశ భవిష్యత్తుకు అనారోగ్యకరం. దేశంలో ఆరేళ్లలోపు పిల్లలు 16కోట్ల మంది ఉన్నారు. భవిష్యత్తులో వివిధ రంగాల్లో సేవలందించే ఈ తరం ఆరోగ్యంపైనే దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. అయితే చిన్నారుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. మన రాష్ట్రంలోనూ పోషకాహార లోపంతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. కేవలం పిల్లలేకాక గర్భిణీల్లో కూడా ఈ సమస్య ఉంది. అయితే ఈ పరిస్థితిని మార్చాలని తెలంగాణ సర్కారు కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. చిన్నారులతో పాటు గర్భిణులకు, బాలింతలకు పోషకాహారం అందిస్తోంది. అంగన్‌ వాడీ కేంద్రాల్లో ప్రతిరోజు అన్నం, పప్పు, గుడ్డుతో పాటు 200మిల్లీలీటర్ల పాలు ఇస్తున్నారు. తల్లులు పిల్లల సంరక్షణ పోషకాహారం ఆరోగ్యం, శుభ్రతపై సలహాలతో ఇతర అంశాలపై అవగాహన కలిగిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న తరుణంలో ఇప్పటికీ అనేక మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడటం ఆందోళకరం. దీన్ని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు తీసుకోకపోవాల్సిన అవసరముంది.