దేశ అభివృద్ధికి డిజిటల్‌ పేమెంట్లది కీలక పాత్ర

– కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌
– గూగుల్‌ సీఈవోతో భేటీ అయిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ, ఆగస్టు30(జ‌నం సాక్షి) : భారత్‌ దేశ అభివృద్ధికి డిజిటల్‌ పేమెంట్లు కీలక పాత్ర పోషిస్తాయని తద్వారా డిజిటల్‌ విప్లవాయానికి దోహదపడుతున్నాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌తో ఆయన  గురువారం సమావేశమయ్యారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న గూగుల్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో భారత్‌లో సాంకేతికాభివృద్ధి, యూజర్లకు అంతర్జాల సేవలు మరింత చేరువకావడం వంటి అంశాలపై ఇరువురూ చర్చించారు. అంతర్జాల వినియోగంతో భారత్‌లో ఉపాధి అవకాశాలు, ఎదురవుతున్న సవాళ్ల పరిష్కార మార్గాలపై రవిశంకర్‌ ప్రసాద్‌.. ఇతర గూగుల్‌ ప్రతినిధులతో కూడా చర్చించారు. అంతర్జాల సమస్యల పరిష్కారానికి కృత్రిమ మేధ వినియోగం, అంకుర, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధితో పాటు భారత్‌లో తమ సంస్థ విస్తరించాలనుకుంటున్న సేవల గురించి గూగుల్‌ ప్రతినిధులు వివరించారు. ఈ సందర్భంగా రవిశంకర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. భారత్‌ అభివృద్ధికి డిజిటల్‌ పేమెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, డిజిటల్‌ విప్లవానికి దోహదం చేస్తున్నాయని అన్నారు. దేశ పౌరులకు సాంకేతికత ఆధారంగా ఉపాధి కల్పించడంలో భారత ప్రభుత్వానికి గూగుల్‌ వంటి సంస్థలు తోడ్పడుతున్నాయని అన్నారు. సుందర్‌ పిచాయ్‌ మాట్లాడుతూ… డిజిటలైజేషన్‌ ద్వారా దేశంలోని పౌరులకు ఎన్నో అవకాశాలు కల్పించడంలో ఉత్సాహంగా ఉన్న భారత ప్రభుత్వ నేతతో చర్చలు జరపడం, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కాగా, కాలిఫోర్నియాలో పర్యటిస్తున్న రవి శంకర్‌ ప్రసాద్‌ పలు సంస్థల సీఈవోలు, ప్రతినిధులతో భేటీ అవుతూ భారత్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి వివరిస్తున్నారు. ప్రధానంగా సైబర్‌ భద్రత, డేటా గోప్యత, తదుపరి తరంలో టెక్నాలజీలో చోటు చేసుకోనున్న మార్పులు, భారత్‌లో వాటి అభివృద్ధి వంటి అంశాలపై ఆయన చర్చలు జరుపుతున్నారు.