దేశ ప్రజలంతా కర్షకుల వైపే..

– ఇంకెవరిపై దాడి చేస్తారు: కేజ్రీవాల్‌

దిల్లీ,డిసెంబరు 20 (జనంసాక్షి):నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఆందోళన చేస్తున్న రైతుల పక్షాన దేశ ప్రజలంతా నిలబడినప్పుడు ఎంతమందిపై కేంద్రం దాడులు చేయించగలదని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. రైతుల ఆందోళనకు మద్దతుగా నిలుస్తున్న పంజాబ్‌లోని కవిూషన్‌ ఏజెంట్లకు (అర్తియాలు) ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్‌ ఈ విధంగా స్పందించారు.”రైతులు చేస్తున్న పోరాటానికి అండగా ఉన్న వ్యాపారులపై కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులు చేయిస్తోంది. ఇలాంటి వ్యాపారులను వేధించడం తప్పు. రైతు ఉద్యమాన్ని పూర్తిగా బలహీన పరిచేందుకే ఇవన్నీ చేస్తున్నారు. ఈ రోజు దేశమంతా రైతులతోనే ఉంది. కేంద్రం ఎవరిపైన దాడి చేయిస్తుంది?” అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ఐటీ నోటీసులకు సంబంధించిన వార్త క్లిప్పింగ్‌ను జత చేశారు.పంజాబ్‌లో గత నాలుగు రోజుల్లో సుమారు 14 మంది అర్తియాలకు ఐటీ శాఖ నోటీసులు జారీ అయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ అన్నారు. వారిపై ఒత్తిడి తెచ్చి రైతు ఉద్యమాన్ని కేంద్రం అణచివేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ మరుసటి రోజే కేజ్రీవాల్‌ ఈ విధంగా కేంద్రంపై విరుచుకుపడ్డారు.