దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తాం

గుణాత్మక రాజకీయాల కోసం పనిచేస్తాం
కాంగ్రెస్‌, బిజెపిలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకీకృతం చేస్తాం
తెలంగాణ దిక్సూచిలాగా నిలిచేలా చేస్తా
ఈ ఫలితాలతో బాధ్యత పెరిగింది
పథకాలను మరింత జోరుగా ముందుకు తీసుకుని వెళతా
నిరుద్యోగులకు నియామకాలతో ఓదారుస్తా
విూడియా సమావేశంలో సిఎం కెసిఆర్‌ వెల్లడి
హైదరాబాద్‌,డిసెంబర్‌11(జ‌నంసాక్షి): దేశ రాజకీయాల్లో తాము కీలక భూమిక పోషించబోతున్నామని, కాంగ్రెస్‌,బిజెపిలకు వ్యతిరేకంగా రాజకీయ మార్పునకు కృషి చేస్తామని సిఎం కెసిఆర్‌ మరోమారు పునరుద్ఘాటించారు.  దేశానికి తెలంగాణ దిక్సూచీగా మారుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశంలో గందరగోళం నెలకొన్నదని, దేశ రాజకీయాలు స్టీరియోఫోనిక్‌గా మారాయన్నారు. దేశం మారకపోతే బాగుపడదు అని కేసీఆర్‌ అన్నారు. ఈ రెండు పార్టీలకు కొమ్ముకాసే విధానం పోవాలన్నారు. అలాగే తామే రాజకీయ మార్పు కోరుకునేది పార్టీల కూటమి కాదని, రాజకీయ మార్పు అని అన్నారు. టిఆర్‌ఎస్‌ విజయం తరవాత తెలంగాణ భవన్‌లో కెసిఆర్‌ పార్టీ నేతలతో కలసి విూడియాతో మాట్లాడారు. వంద శాతం నాన్‌ కాంగ్రెస్‌, నాన్‌ బీజేపీ పరిపాలన రావాలన్నారు. ఇవాళ్టి తెలంగాణ ఫలితాలు.. దేశానికి ఓ మార్గాన్ని చూపించిందన్నారు. మాకు ఎవరూ బాసులు లేరు, ఏజెంట్లం కాం, ప్రజలే మమ్ముల్ని ఏజెంట్లుగా చేశారని వారి ఆకాంక్షలకు అనుగుణంగా  జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తమని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ఇందుకు రోల్‌ మాడల్‌ కానుందన్నారు. ఈ దేశానికి 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నాయని, కానీ 30 వేల టీఎంసీలను మాత్రమే వాడుతున్నారని ఆరోపించారు. డివైసివ్‌ పాలిటిక్స్‌ నుంచి దేశం బయటపడాలన్నారు.నేటి నుంచి దేశ రాజకీయాలపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. పెసిమిస్టిక్‌ గా ఉండకూడదన్నారు. ఆప్టిమిస్టిక్‌గా ఉండాలన్నారు. కొందరు డర్టీ, సిల్లీ పాలటిక్స్‌ ఆడుతున్నారని, దేశ ప్రజలను ఏకం చేస్తానన్నారు. ప్రజలకు ప్రభుత్వ పట్ల విశ్వాసాన్ని పెంచతామన్నారు.  ఇంతకాలం నీటిని ఉపయోగించుకోని కాంగ్రెస్‌, బీజేపీ నేతలు సిగ్గుబడాలి, దేశానికి కొత్త ఆర్థిక విధానం అసవరం, కొత్త వ్యవసాయ విధానం కావాలన్నారు. కేవలం ఉత్పత్తిపైన మాత్రమే ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని, ఇజ్రాయిల్‌, చైనాతో పోలిస్తే మనం ఎక్కడ ఉన్నామో తేల్చుకోవా లన్నారు.  విశ్లేషకులు అశోక్‌ గులాటి ఓ ఆర్టికల్‌ రాశారు. రైతులకు ఏం చేయాలన్న అంశాన్ని అద్భుతంగా రాశారన్నారు. టీఆర్‌ఎస్‌ తెలంగాణలో ఏం చేసిందో రాసి చూపారాన్నారు. రైతు పెట్టుబడితో రైతులకు ఫ్రీడం ఇచ్చేశామన్నారు. స్వామినాథన్‌ కూడా తెలంగాణ పథకాలను మెచ్చుకున్నారన్నారు.  అందుకే జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తామని ముఖ్యమంత్రి  తేల్చిచెప్పారు.  చైతన్యవంతమైన గడ్డ కాబట్టి దేశ రాజకీయాల్లో కూడా ప్రాతినిధ్యం వహించాలి. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు నాయకులు కాదు. ఇండియాలో మెచ్చురిటీ రావాలి. ప్రధానమంత్రులు, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, అన్ని పార్టీల పెద్దలు వచ్చి ప్రచారం చేశారు. అంతిమ నిర్ణయం ప్రజలు ఇచ్చారు. మమతా బెనర్జీ, సీఎం నితీశ్‌ కుమార్‌ ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంగా దేశంలో ఓ అనిశ్చితి ఉంది.. ఇది మారాలి. దేశంలో కాంగ్రెస్‌, బీజేపీయేతర ప్రభుత్వాలు రావాలి. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ సహకారం లేకుండా అధికారంలోకి వచ్చాం. తమకు ప్రజలే బాస్‌లు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి ఆయా పార్టీల నేతలను కలుస్తానని చెప్పారు. కొన్ని పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని కేసీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయానికి కారకులైన తెలంగాణ ప్రజలందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి లభించిన ఘనవిజయం పూర్తిగా తెలంగాణ ప్రజల విజయం. రైతులు, మహిళలు, నిరుపేద ప్రజలు, వెనుకబడిన వర్గాల ప్రజలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు కులాలకు అతీతంగా నిండుగా దీవించి ఇచ్చిన విజయం అన్నారు. విజయానికి కారకులైన వారికి శిరసు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు అ¬రాత్రులు కష్టపడి పని చేశారు. మంచి విజయం సాధించారు. నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు. సమయాన్ని వృధా చేయకుండా ప్రజల కోసం పని చేయాలి. పాజిటివ్‌ కోణంలో వెళ్లాలి. కొత్త రాష్ట్రాన్ని ఒక బాటలో పెట్టాం.. గమ్యం చేరడానికి ప్రయత్నించాలి. కోటి ఎకరాలు పచ్చబడాలె. అది అయి తీరాలె. ఆ లక్ష్యం జరిగి తీరాలి. టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే కాళేశ్వరం.. కూటమిని గెలిపిస్తే శనేశ్వరం అని ఎన్నికల సమయంలో చెప్పాను. ప్రజలు కాళేశ్వరం కావాలనే మమ్మల్ని గెలిపించారు. ప్రజలు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తాం. సానుకూల ధోరణితో ముందుకెళ్తాం. ధనికులైనటువంటి రైతులు తెలంగాణలో ఉన్నారనే పేరు వచ్చే విధంగా రైతుల కోసం పని చేస్తాం. గిరిజనులు, గిరిజనేతరులు పడుతున్న భూ హక్కుల విషయాన్ని వీలైనంత త్వరగా సత్వర పరిష్కారం చేస్తాం అని అన్నారు.  కులవృత్తులు కుదుటపడేలా చేస్తాం. యువతకు ఉపాధి, ఉద్యోగాలు విరివిగా లభించే విధంగా ముందుకెళ్తాం. నిరుద్యోగ సమస్య అనేది తెలంగాణకే పరిమితమైంది కాదు.. భారతదేశం అంతటా ఉన్న సమస్య. ఉద్యోగ ఖాళీలన్నీంటిని వీలైనంత త్వరగా భర్తీ చేస్తాం. ప్రభుత్వయేతర రంగాల్లో కూడా విరివిగా ఉద్యోగాలు వచ్చేలా చేస్తాం. విజయం ఎంత ఘనంగా ఉందో.. బాధ్యత కూడా అంతే బరువుగా ఉంది. పెన్షన్లు కూడా పెంచుతాం. భద్రతతో కూడా బతుకును కల్పిస్తాం. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా ముందుకెళ్తాం అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. కె.కేశవరావు, కడియం శ్రీభరి, జితేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.