దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలి
కెసిఆర్ అందుకు సమర్థుడైన నేత
వేణుగోపాలాచారి
ఆదిలాబాద్,డిసెంబర్15(జనంసాక్షి): దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని ఢిల్లీలో అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పులు అవసరమని అన్నారు. కేంద్రంలో నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. కెసిఆర్ సమర్థుడైన నాయకుడని, ఆయన ఈ లక్ష్యాన్ని చేరుకోగలరని అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా యువనేత కేటీఆర్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు. యువనేతకు పార్టీ బాధ్యతలు అప్పచెప్పడం పట్ల టీఆర్ఎస్ సంస్థాగతంగా మరింత బలోపేతం అవుతుందన్నారు.సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలకు సమయం ఇవ్వడంతో పాటు ప్రజలకు ఇచ్చిన హావిూలను నెరవేర్చడం కోసం కేటీఆర్కు పదవి కట్టబెట్టినట్లు తెలిపారు. నాలుగేళ్లలో తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు అయ్యాయని రాష్ట్రం బంగారు తెలంగాణ వైపు వైపు అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పాలనే తమకు శ్రీరామరక్ష అని ప్రజలు కోరుకుంటున్నారని ఇందులో భాగంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధిక సీట్లు సాధించినట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో నూతన పారిశ్రామిక విధానం అమలవుతోందని అందుకు కెటిఆర్ చేస్తున్న కృషి కారణమన్నారు. కేటీఆర్ నియామకంతో పార్టీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం కావడమే కాకుండా రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని పేర్కొన్నారు.