దేశ సమగ్రతకు విఘాతం కల్గిస్తే ఊరుకోం గులాంనబీ ఆజాద్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22 (జనంసాక్షి):
గత రాత్రి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరిగిన బాంబ్‌ పేలుళ్ల సంఘటన వెనుక ఎంత పెద్ద ఉగ్రవాదులున్నప్పటికి వదిలే ప్రసక్తేలేదని కేంద్ర మంత్రి గులాం నబీ అజాద్‌ హెచ్చరించారు. సంఘటనా స్థలాలను పరిశీలించిన అనంతరం ఆజాద్‌ విూడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదులచర్యలు దేశసమైక్య తకు, సమగ్రతకు సవాల్‌ లాంటిదన్నారు. ఈతరుణంలో ప్రజలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమైక్యంగా, సంఘటితంగా ఉండి విచారణ జరు పాల్సినవసరం ఉందన్నారు. ప్రతిసారి ఇలాంటి సంఘటనలు పెద్దఎత్తున ప్రాణ, ఆస్థి నష్టాలను కలిగిస్తూనే ఉన్నాయన్నారు. హైదరాబాద్‌ ఘటనపై ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాందీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు యువనేత రాహుల్‌గాంధీలు తమ విచారాన్ని వ్యక్తం చేశారని, మృతులకుటుంబాలకు సంతాపం ప్రకటించారని గులాంనబీ ఆజాద్‌ పేర్కొన్నారు. దేశమంతా ముక్తకంఠంతో ఈఘటనను ఖండించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నా యని, త్వరలోనే నిందితులను పట్టుకుని తీరుతామన్నారు. గతంలో మాలేగాం, జైపూర్‌, పుణెళి, కాశ్మీర్‌ లాంటి ప్రదేశాల్లో సైతం సైకిళ్లు, కార్లు, బైక్‌ లను ఆదారంగా చేసుకుని బాంబులు అమర్చిన సంఘటనలున్నాయని, హైదరాబాద్‌ ఘటన కొత్తేమి కాదన్నారు. అనుమానాస్పద  స్థితిలో ఉన్న వాహనాల విషయంలో ప్రతిఒక్కరు జాగ్రత్తగా వ్యవహరించి పోలీసులకు సమాచారం అందిస్తూనే ఉండాలని సూచించారు. విదేశీయులా, దేశీయులా, రాష్టాన్రికి చెందిన ఉగ్రవాదులా అనే విషయం ప్రక్కన పెడితే ఘటనలు దేశానికి సవాల్‌గా నిలుస్తున్నాయన్నారు. సిసి కెమెరాలు పనిచేయడం లేదనే అంశం గూర్చి తనకు పూర్తి సమాచారం లేకపోయినప్పటికి కొన్నింటిలో మాత్రం కొన్ని దృశ్యాలు లభించాయన్నారు. విచారణ ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడు ఎవరు ఈసంఘటనకుపాల్పడిందని చెప్పడం కంటే పూర్తిగా నిర్దారణకు వచ్చాకే ప్రకటన చేయడం జరుగుతుందన్నారు. దోషులను పట్టుకునేందుకు తప్పకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తాయని, ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. కాశ్మీర్‌ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు జరిగిన ఎన్నో సంఘటనలను చూసిన తాను తన అనుభవాలను రాష్ట్ర ప్రభుత్వంతో, అధికారులతో షేర్‌ చేసుకునేందుకు ప్రయత్నించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం సంఘటనపై విచారణ జరుగుతుండగా క్షతగాత్రులను ఆదుకోవడంతోపాటు, మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు పోకుండా కాపాడడమే ప్రధాన ఎజెండాగా ప్రతిఒక్కరం పనిచేయాల్సి ఉందన్నారు. కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ గులాంనబీ ఆజాద్‌ గత రాత్రి హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రత్యేక విమానంలో న్యూడిల్లీనుంచి వచ్చిన గులాంనబీ ఆజాద్‌తోపాటు రాష్ట్రకాంగ్రెస్‌ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ¬ంమంత్రి సబితా ఇంద్రారెడ్డిలు, దానం నాగేందర్‌, కొండ్రు మురళి, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీతోపాటు డిజిపి దినేష్‌రెడ్డిలు రెండు ప్రదేశాలను పరిశీలించారు. ఇదిలా ఉంటే ఆజాద్‌ మాట్లాడుతున్నప్పుడు, అంతకుముందు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఆజాద్‌కు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలివ్వడమేకాక, మంత్రిని ప్రశ్నించిన వ్యక్తిని పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. ఈక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రజలపై పోలీసులు తమ లాఠీలతో గుణపాఠం చెప్పారు. గుమికూడిన ప్రజలను చెదరగొట్టారు.