దేహదారుఢ్య పరీక్షల్లో అపశృతి

– పరుగు పందెంలో పాల్గొని మహిళా అభ్యర్థి మృతి
కరీంనగర్‌, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) : తెలంగాణలో జరుగుతున్న పోలీస్‌ ఎంపికల పోటీల్లో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. సోమవారం కరీంనగర్‌లోని సిటీ పోలీస్‌ శిక్షణ సెంటర్లో నిర్వహించిన పరుగు పందెంలో యువతి ప్రాణాలు కోల్పోయింది. దీంతో అక్కడ విషాదం నెలకొంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం వెలిశాల గ్రామానికి చెందిన వి. మమత(20) సోమవారం పోలీస్‌ దేహదారుఢ్య పరీక్షలకు హాజరైంది. దీనిలో భాగంగా అభ్యర్థులకు 100విూటర్ల పరుగు పందెం నిర్వహించారు. ఈ పందెంలో ఉత్సాహంగా పాల్గొన్న మమత కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. అక్కడే అందుబాటులో ఉన్న డాక్టర్లు ఆమెకు ప్రాథమిక చికిత్స అందజేసి అనంతరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మమత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మెరుగైన చికిత్స అందించినా ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ బి. కమల్‌హసన్‌ రెడ్డి వెంటనే ఆస్పత్రికి చేరుకుని మమత మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. వైద్య పరంగా అన్ని సహకారాలూ అందించామని, ప్రభుత్వ సాయం అందేలా ప్రయత్నిస్తామని తెలిపారు. ప్రభుత్వ సాయం అందేలా ప్రయత్నిస్తామని తెలిపారు. అభ్యర్థులకు ఆరోగ్య సమస్యలు ఉంటే ముందే తెలిపితే గడువు పొడిగిస్తామని తెలిపారు.