దొంగలనుకుని కూలీలపై దాడి
చికిత్స పొందుతూ ఒకరు మృతి
నిజామాబాద్,మే23( జనం సాక్షి): నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం చేంగల్ గ్రామ శివారులో ఇద్దరు గిరిజనులు దేడావత్ లాలు, దేవ్యానాయక్‌ను దొంగలుగా భావించి గ్రామస్థులు చితకబాదిన ఘటన కలకలం రేపింది. వీరిని దొగంలుగా భావించిన ప్రజలు వారిపై దాడికి తెగబడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలో ఓ రైతు పొలంలోని మామిడి చెట్టు వద్దకు ఇద్దరు వ్యక్తులొచ్చారు. అక్కడే గొర్రెలు మేపుతున్న మరో వ్యక్తి గ్రామస్థులకు విషయాన్ని చేరవేశాడు. గ్రామస్థులు ఆ ఇద్దరు వ్యక్తులపై కర్రలతో దాడి చేశారు. విషయం తెలుకొన్న పోలీసులు గ్రామానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకొన్నారు. ఇద్దరూ తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.ఇందులో దేవ్యానాయక్ పరిస్థితి విషమంగా ఉందని ఎస్సై సుఖేందర్‌రెడ్డి తెలిపారు. చితకబాదిన గ్రామస్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో 9 మంది కొత్త వ్యక్తులపై స్థానికులు దాడికి యత్నించారు. ఎస్‌ఐ వారిని తీసుకుని విచారించగా తోటలో పనిచేసేందుకు వచ్చిన వారిగా తేలింది.కిడ్నాపర్లు, దొంగలు సంచరిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలంటూ సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలనిప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. నేరస్థులు తిరుగుతున్నారంటూ వాట్సప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న ప్రచారం నిజం కాదని, ఆతరహా వదంతులను నమ్మవద్దని స్పష్టం చేశారు.
———