ధరణి పోర్టల్‌లో వివరాలు నమోదుపై హైకోర్టు స్టే
హైదరాబాద్,నవంబరు3 (జనంసాక్షి):ధరణి పోర్టల్‌లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీల వివరాలు నమోదుపై హైకోర్టు స్టే విధించింది. పోర్టల్‌లో భద్రతాపరమైన అంశాలపై, దాఖలైన మూడు పిటిషన్‌లను మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధరణి పోర్టల్‌లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ వివరాలు నమోదు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. భద్రతాపరమైన నిబంధనలు పాటించకుండా వ్యవసాయేతర భూములు వివరాలు నమోదు చేయడంతో ఇబ్బందులు తలెత్తుతాయని హైకోర్టు పేర్కొంది.గూగుల్ ప్లే స్టోర్‌లో ధరణి పోర్టల్‌ను పోలిన మరో నాలుగు యాప్స్ ఉన్నాయని హైకోర్టు తెలిపింది. దీంతో అసలు ధరణి పోర్టల్ ఏదో తెలుసుకోవడం ప్రజలకు ఇబ్బందిగా మారుతోంది. నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీలకు సంబంధించి ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారో తెలపాని హైకోర్టు కోరింది. రెండు వారాల్లో కౌంటర్ ద్వారా పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.అప్పటివరకూ ఎలాంటి నమోదు చేయకూడదని సూచించింది. ప్రజల నుంచి వివరాలు నమోదు చేయడంలో బలవంతం చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.