ధవళేశ్వరం వద్ద పెనుప్రమాదం
– బ్రిడ్జిపై నుంచి నదిలోకి పడ్డ వాహనం
– 22 మంది మృతి
రాజమండ్రి,13 జూన్ (జనంసాక్షి) :
కన్నుమూసి తెరిచే లోపే మృత్యువు కాటేసింది. నిశిరాత్రి ఏం జరిగిందో తెలియకుండానే కానరాని లోకాలు చేరుకున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 22 మంది ఒకే కుటుంబానికి చెందిన, ఒకే గ్రామానిక చెందిన వారు మృత్యుఒడికి చేరారు. వీరి తీర్థయాత్ర కాస్తా విషాదంగా ముగిసింది. తూర్పుగోదావరి జిల్లాలో ఈ పెను విషాదం చోటు చేసుకుంది. ధవళేశ్వరం బ్యారేజీపై డివైడర్‌ను ఢీకొట్టిన తుఫాను వాహనం అదుపుతప్పి గోదావరిలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 22మంది దుర్మరణం చెందారు. ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఉన్న 23 మందిలో ఆరుగురు చిన్నారులు, ఆరుగురు పురుషులు, తొమ్మిది మంది మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన వీరంత తిరుమల దైవ దర్శనానికి వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదానికి గురైనట్లు పోలీసులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు చిన్నారులను 108లో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. గాయపడిన ఈగల కిరణ్(13)ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులంతా విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం మూసాయిపేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. దీంతో బందవుల రోదనలతో గోదావరి తడిసిపోయింది. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఇంటికి తిరిగివస్తూ మార్గమధ్యలో ద్రాక్షారామం పరమేశ్వరుడిని దర్శించుకోవాలని భావించి చివరకు ఆ పరమేశ్వరుడి చెంతకే వెళ్లారు.నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ చేతిలో స్టీరింగ్ అదుపు తప్పడమే ప్రమాదానికి కారనమని విశ్లేషిస్తున్నారు. తీర్థయాత్రల్లో భాగంగా తిరుపతి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో వాహనం డ్రైవర్ కూడా మృతి చెందాడు. దాదాపు 50 అడుగుల పైనుంచి పడటంతో వాహనం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను క్రేన్ల సాయంతో వెలికి తీశారు. ఈ ప్రమాదం నుంచి ఒక పాప, ఒక బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా పాప ఈగల సంధ్య కూడా మృతి చెందింది. ఈ ఘటనలో మృతిచెందిన వారిని రమణ, వెంకట లక్ష్మి, సాయి, రాజా, కార్తీక్, కోసమ్మ, నవిత్, నవ్య, ప్రసాద్, అన్నపూర్ణ, లలిత, హర్ష, గోపి, కొండమ్మ, సంధ్యలుగా గుర్తించారు. మరికొంతమంది మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాలు తరలింపు
గోదావరిలో బోల్తాపడిన ప్రమాదంలో 22 మంది మృతి చెందిన ఘటనలో శవాలను, ఘటనాస్థలంలో పంచానామా నిర్వహించిన అధికారులుశవపరీక్ష కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల బంధువుల రోదనలతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. ఐదుగురు వైద్యుల బృందం శవపరీక్ష చేపట్టింది.
ఘటనాస్థలిని పరిశీలించిన చినరాజప్ప
ధవళేశ్వరం వద్ద బ్యారేజీపై నుంచి తుఫాను వాహనం గోదావరిలో బోల్తాపడిన ప్రమాద ప్రాంతాన్ని
డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప పరిశీలించారు. ఘన జరిగిన విషయం తెలుసుకున్న రాజప్ప హుటాహుటిఇ అక్కడికిచేరుకున్నారు. ప్రమాద స్థలిని ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్, ఎస్పీ హరికృష్ణ పరిశీలించారు. ప్రమాద ఘటన బాధాకరమని చినరాజప్ప అన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఆయన తెలిపారు.
ధవళేశ్వరం ప్రమాదంపై ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుగ్భ్భ్రాంతి
ధవళేశ్వరం వద్ద జరిగిన ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబుగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఉపముఖ్యమంత్రి చినరాజప్పకు ఆదేశించారు. బాధితులకు తక్షణ సాయం అందించాలన్నారు. ధవళేశ్వరం ప్రమాద ఘటనపై తెదేపా కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త నారా లోకేష్ తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు
పిట్టగోడను ఢీకొని 30 అడుగుల లోతులో పడ్డ వాహనం
తూఫాన్ వాహనం పిట్టగోడను ఢీకొని వంతెనపై నుంచి 30 అడుగుల లోతులో గోదావరిలో పడిందిని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ హరికృష్ణ తెలిపారు. మృతుల బంధువులకు సమాచారం అందించామని వెల్లడించారు. బంధువులు వచ్చాక శవపరీక్షలు చేసి మృతదేహాలు అప్పగిస్తామని ఎస్పీ వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే సిబ్బందితో వెల్లి సహాయక చర్యలు చేపట్టామన్నారు. మృతులను గోదావరి నుంచి తీసి రాజమండ్రి ఆస్పత్రికి తరలించామన్నారు. క్రేన్ సహాయంతో వాహనాన్ని , మృతులను బయటకు తీసామన్నారు.
ప్రధాని మోడీగ్భ్భ్రాంతి
ధవళేశ్వరం ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నట్లు ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీపై నుంచి గోదావరిలో తుఫాన్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం మూసాయిపేట గ్రామానికి చెందిన 22 మంది మృతిచెందారు.
మృత్యుంజయుడు కిరణ్
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద తుఫాను వాహనం అదుపుతప్పి గోదావరిలో బోల్తాపడిన ఘటనలో 22మంది మృతి చెందగా, ఈగల కిరణ్(13) మాత్రం మృత్యుంజయుడిగా మిగిలారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 23మంది ఉండగా కిరణ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. కిరణ్ తలకు బలమైన గాయం కావడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం మూసాయిపేట గ్రామానికి చెందిన వారు. కిరణ్ ఒక్కడే మృత్యుంజయుడిగా బయటపడి ప్రమాద ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో కిరణ్ మాట్లాడుతూ…. భద్రాచలం, శ్రీశైలం, తిరుమల, శ్రీకాళహస్తి, విజయవాడ దుర్గమ్మ ఆలయాలను దర్శించుకుని తిరిగి వస్తుండగా రాత్రి 10గంటల సమయంలో ప్రమాదం జరిగిందని తెలిపాడు. అందరూ నిద్రమత్తులో ఉండగా వాహనం ఒక్కసారిగా గోదావరిలో పడిపోయిందని… కళ్లు తెరచి చూస్తే నదిలో ఉన్నానని జరిగిన ప్రమాదాన్ని వివరించాడు. కిరణ్ నుంచి ఘటన కు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించారు. ఈ ప్రమాదం తెల్లవారు జామున జరగలేదన్నారు. రాత్రి 10గంటల సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని వెల్లడించాడు.