ధశలేశ్వరం వద్ద గోదాశరి ఉధృతి

గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలిన అధికారులు

రాజమండ్రి,జూలై11(జనం సాక్షి ): భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. గంట గంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద నీటిమట్టం 8 అడుగులకు చేరింది. దీంతో అధికారులు బ్యారేజీ 175 గేట్లు ఎత్తివేత ఆరు లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు కోనసీమ లంక గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాటుపడవలపైనే రాకపోకలు కొనసాగుతున్నాయి. అలాగే పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అటు విలీన మండలాల్లో శబరి, గోదావరి భారీ వర్షాలకు పొంగి ప్రవహిస్తోంది. చింతూరు మండలం సోకిలేరు వంతెనపై వరద నీరు ప్రవహిస్తుండటంతో చింతూరు ` విఆర్‌ పురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం 38 అడుగులకు చేరుకుంది. వీఆర్‌పురం మండలం ములకపాడు గ్రామ సవిూపంలోకి గోదావరి పోటెత్తింది. దీంతో గ్రామస్తులు కొండలపై తాత్కాలిక గుడిసెలు వేసుకుని తల దాచుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ అధికారులు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.