ధాన్యం కొనాల్సిందే..`
సభలో పట్టువదలని టీఆర్ఎస్ ఎంపీలు`
ఉభయసభల్లోనూ ప్లకార్డులతో ప్రదర్శన
` నేటికి వాయిదా పడిన రాజ్యసభ
న్యూఢల్లీి,డిసెంబరు 1(జనంసాక్షి):రాజ్యసభ వరుసగా మూడో రోజు కూడా విపక్ష సభ్యుల ఆందోళనలతో అట్టుడికింది. టీఆర్ఎస్ ఎంపీలతోపాటు ఇతర పార్టీల ఎంపీలు కూడా ధాన్యం సేకరణ, పంటలకు కనీస మద్దతు ధర, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో మరణించిన రైతులకు పరిహారం విషయమై సభలో నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టారు. ధాన్యం సేకరణపై కేంద్రం సమగ్ర విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. విపక్షాల ఆందోళనలతో సభలో గందరగోళం నెలకొనడంతో ఛైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా సేమ్ సీన్ రిపీట్ కావడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు, ఆ తర్వాత 3 గంటల వరకు సభ వాయిదా పడిరది. మధ్యాహ్నం మూడు గంటలకు సభ తిరిగి ప్రారంభమైనా గందరగోళం కొనసాగడంతో రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు. పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన స్వరం పెంచారు. ధాన్యం సేకరణపై కేంద్రం సమగ్ర విధానం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్యసభ నేటికి వాయిదాపడగా.. లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగుతున్నది. పార్టీకి చెందిన 9 మంది ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి బైఠాయించారు. ధాన్యం సేకరణపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు రాసివున్న ప్లకార్డులు ప్రదర్శించారు. టీఆర్ఎస్ సభ్యుల నినాదాలతో లోక్సభ హోరెత్తింది.తెలంగాణ రైతాంగాన్ని న్యాయం జరిగేవరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టంచేశారు.