ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో రైతుల ఆందోళన
వెన్నాడుతున్న అకాల వర్షం భయం
మెదక్,మే14(జనం సాక్షి): రైతు తమ ధాన్యాన్ని అమ్మిన తరువాత 48 గంటల్లో డబ్బులు చెల్లిస్తామంటూ సర్కారు ప్రకటించింది. దీంతో రైతులు ఎక్కువగా దళారులకు పంటను విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలోనే విక్రయానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే మార్కెట్‌కు తీసుకుని వచ్చే
ధాన్యం నాణ్యతాప్రమాణాలు పాటిస్తేనే తీసుకుంటామని మిల్లర్లు తెగేసి చెబుతుండటంతో కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని జ్లలెడ పట్టాకే కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు అకాల వర్షం రైతన్నలను ఆందోలనకు గురిచేస్తోంది. అలాగే టన్నుల కొద్దీ ధాన్యాన్ని శుభ్రం చేసే యంత్రంలో జ్లలెడ పట్టాలంటే రోజుల తరబడి కేంద్రాల్లో నిరీక్షించక తప్పడం లేదని రైతులు వాపోతు న్నారు. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా శుభ్రపర్చి.. ఎండబెట్టి కేంద్రాలకు తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. అప్పుడే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర దక్కుతుందని చెబుతున్నారు. మద్దతు ధర పొందాలంటే చెడిపోయిన, పురుగు తిన్న, మొలకెత్తిన ధాన్యం నాలుగు శాతానికి మించ కుండా ఉండాలనే నిబంధనతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యాన్ని బాగా ఆరబెట్టి, చెత్త, తాలు, మట్టిపెళ్లలు లేకుండా శుభ్రపర్చి తెచ్చిన ధాన్యాన్నే కేంద్రాల్లో స్వీకరిస్తామని ప్రకటిస్తుండ డంతో ఆందోళన చెందుతున్నారు. ప్యాడీక్లీనర్‌లు అందుబాటులో లేని పలు ఐకేపీ కేంద్రాల్లో కొనుగోళ్లు స్తంభించిపోతున్నాయి. దీంతోరైతులు ఎంతో కష్టపడి పండించిన ఉత్పత్తులను అమ్ముకోవ డానికి నానా కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువెళుతున్న రైతులకు పలు సమస్యలు వేధిస్తున్నాయి. ప్యాడీ క్లీనర్‌లు ఉపయోగించడం వల్ల తూకానికి తీవ్ర జాప్యం జరుగుతోంది. తెచ్చిన ధాన్యం శుభ్రం చేయడానికి ఛార్జీ వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. సరిపోయే ప్యాడీక్లీనర్లు లేకపోవడం వల్ల ధాన్యం జ్లలెడ పట్టడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోజుల తరబడి ఎండలో ధాన్యం ఉంచడం వల్ల తమకు నష్టం జరుగుతుందని వాపోతున్నారు. జిల్లాలో సహకార శాఖ, ఐకేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. వీటిల్లో వందకు పైగా కేంద్రాలను ప్రారంభించారు. గతంలో హమాలీ ఛార్జీలను ప్రభుత్వమే భరించేదని.. క్వింటాలు ధాన్యానికి రూ.20 చెల్లించేదని రైతులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం క్వింటాలుకు రూ.20 రైతులు భరిస్తున్నారు. మిల్లర్లు యంత్రాల ద్వారా శుభ్రం చేసిన ధాన్యాన్నే తీసుకుంటామని తెగేసి చెబుతున్నారు. ఇలా టన్నుల కొద్దీ ధాన్యం ఎప్పుడు తూకం వేస్తారు. రోజుల తరబడి కేంద్రంలో ధాన్యం ఉంచితే తూకంలో నష్టపోతామని అభ్యంతరం చెప్పాం.
……………………..