ధాన్యం దళారులకు అమ్మొద్దు
జనగామ,అక్టోబర్17(జనంసాక్షి): ఏ గ్రామ రైతు కూడా దళారులకు పంట విక్రయించొద్దనే ఉద్దేశంతో పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామతీ ఏపీఎం జ్యోతి అన్నారు. ఇప్పటి వరకు ప్రాంభించిన గ్రామాలతో పాటు మిగిలిన గ్రామాల్లో కూడా త్వరలోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని అన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 1770 లు, బీ గ్రేడ్ ధాన్యానికి రూ., 1750లు ధర నిర్ణయించారు. దీంతో రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకే ధాన్యాన్ని తరలిస్తున్నారు. కాంట అయిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలిస్తున్నారు.అదే విధంగా కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు సకాలంలో అందించే విధంగా అన్‌లైన్ చేస్తున్నారు. పలు గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం భారీగా వస్తోంది. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వరిపంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు బచ్చన్నపేట, పోచన్నపేట, బండనాగారం, కొడవటూరు, ఇటిక్యాలపల్లి, కేశిరెడ్డిపల్లి, చిన్నరామన్‌చర్లలో ఐకేపీ ఆద్వర్యంలో కేంద్రాలు ప్రారంభించగా, తమ్మడపల్లి, కట్కూర్‌లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.