ధిక్కారస్వరం కాళోజీకి ఘన నివాళి

c

– గోరేటి వెంకన్నకు కాళోజీ పురస్కారం

– అట్టహాసంగా తెలంగాణ అధికార భాషా దినోత్సవం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): రవీంధ్రభారతిలో ప్రజాకవి కాళొజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాళోజీ నారాయణరావు 102వ జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రముఖ రచయిత, గాయకుడు గోరెటి వెంకన్నకు రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. కాళోజీ నారాయణరావు 102వ జయంతి సందర్భంగా ప్రభుత్వం వెంకన్నను కాళోజీ పురస్కారంతో ఘనంగా సత్కరించింది. పురస్కారం అందుకున్న సందర్భంగా వెంకన్న తన తల్లికి పాదాభివందనం చేశారు. వెంకన్నను మంత్రులు కొనియాడారు. రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్‌, స్పీకర్‌ మధుసూదనాచారి, సాంస్కృతిక శాఖ చైర్మన్‌ రసమయి బాలకిషన్‌తో పాటు పలువురు హాజరయ్యారు. కాళొజీ సేవలను అంతా కొనియాడారు. సభాపతి మధుసూదనాచారి మాట్లాడుతూ… తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక కాళొజీ అని వివరించారు. కాళొజీ పేరటి ఏర్పాటు చేసిన అవార్డును గోరటి వెంకన్నకు ప్రదానం చేయడం అభినందనీయమన్నారు. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి.. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి. అన్యాయన్ని ఎదురించినవాడు నాకారాద్యుడు అంటూ జనం ఆవేదనను, ఆక్రందనలను తన గొడవగా ఎంచుకొని దాన్ని తీర్చడానికే జీవితాంతం కృషిసల్పిన మహనీయుడు కాళోజీ నారాయణరావు అని మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. తన స్కూలు, కాలేజీ జీవితాలను కాళోజీతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. అంతటి మ¬న్నతుడి పేరున అవార్డును గోరేటి వెంకన్నకు ఇవ్వడంలో ఔచిత్యం ఉందన్నారు. 1971లో తనకు కాళోజీ పరిచయమయ్యారు. నచ్చకపోతే చీల్చి చెండాడడం కాళోజీ నైజం. బతికినంత కాలం తెలంగాణ కోసమే బతికిన కవి కాళోజీ అని కొనియాడారు. ప్రజా కవి గోరేటి వెంకన్న పాటలు తెలంగాణ పల్లెల జీవం. వెంకన్న పాట ఎప్పటికీ సజీవంగా ఉంటుందని తెలిపారు.  రచయిత, గాయకుడు గోరెటి వెంకన్నకు కాళోజీ పురస్కారం రావడం సంతోషంగా ఉందని ¬ంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. వెంకన్న ప్రజల గొంతుక అని చెప్పారు. పల్లె ప్రజల గోసను వెంకన్న పాటల రూపంలో చెప్పారు.. ఆయన పాట పాడితే ప్రజానీకం ఏడ్చారు అని తెలిపారు. ఉద్యమ సమయంలో వెంకన్న పాట పాడితే తామంతా ఎగిరేవాళ్లమని గుర్తు చేశారు. తెలంగాణ కోసం పాటలు రాసిన వెంకన్నకు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. వెంకన్న పాటలన్నీ ఒక క్యాసెట్‌ రూపంలో తెచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. ఇందుకు ప్రభుత్వంతో చర్చిస్తామని నాయిని తెలిపారు. ఈ సందర్భంగా కవి దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ… కాళోజీ అంటే వ్యక్తికాదు… శక్తి. కాళోజీ మనకాలం వేమన అని కొనియాడారు. కాళోజీ కవిత్వంలో రాజకీయ ప్రకటన చేశారు. కాళోజీ భావనల ప్రతిరూపం నాగొడవ మహాకావ్యం. చరిత్ర గమనానికి కోళోజీ సాక్షి. యమున్ని సైతం ధిక్కరించే ఖలేజా ఉన్న కవి కాళోజీ అని తెలిపారు. పేదల గుండెల దుఃఖాన్ని వినగలిగిన కవి గోరేటి వెంకన్న. తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారడానికి కవిగా, వాగ్గేయాకారుడిగా వెంకన్న ఎంతో కృషి చేశారని చెప్పారు.  రచయిత, గాయకుడు గోరెటి వెంకన్న పాటలను తెలంగాణ ప్రజలే కాకుండా తెలుగు ప్రజలందరూ ఆదరించారని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు.  గోరెటి వెంకన్నకు కాళోజీ పురస్కారం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. వెంకన్న పాటలు తెలంగాణ ప్రజలను కదిలించాయన్నారు. ఉద్యమానికి ఊపిరినిచ్చాయని తెలిపారు. భావితరాలకు వెంకన్న పాటలు అందాల్సిన అవసరం ఉందన్నారు. వెంకన్న పాటలన్నింటినీ ఆల్బమ్‌గా తీసుకువస్తామని చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి వెంకన్నకు డాక్టరేట్‌ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరుతాను అని పేర్కొన్నారు. వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. అన్యాయంపై పోరాడే వారికి కాళోజీ సంఘీభావం తెలిపారని గుర్తు చేశారు.  ‘అద్దాల అంగడి అంటూ..’ గోరేటి వెంకన్న ఆలపించిన పాట సభికులను ఆకట్టుకుంది.