ధీర జవానుకు మోదీ పరామర్శ

2

– మెరుగైన వైద్యం అందించండి

– ప్రధాని

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 9(జనంసాక్షి): సియాచిన్‌ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డ జవాను లాన్స్‌ నాయక్‌ హనుమంతప్పను ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరామర్శించారు. దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హనుమంతప్పను ప్రధాని మోదీ, ఆర్మీ చీఫ్‌ దల్బీర్‌ సింగ్‌ నేడు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని సూచించారు. అలాగే భారత ప్రజల ఆశిస్సులు హనుమంతప్పకు ఉన్నాయని అన్నారు. సియాచిన్‌లో 19 వేల అడుగుల ఎత్తులో మంచు చరియలు విరిగిపడడంతో ఓ అధికారి సహా పదిమంది జవాన్లు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి కర్ణాటకకు చెందిన జవాను హనుమంతప్ప ఆరు రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. మంచుచరియల్లో చిక్కుకున్న లాన్స్‌ నాయక్‌ హనుమంతప్పను మంగళవారం సహాయకసిబ్బంది గుర్తించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

కుటుంబసభ్యుల ఆనందం

వారం రోజులు మంచులో కూరుకుపోయి  బయటపడ్డ వీరజవాను హనుమంతప్ప బయట పడడంతో ఆయన కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేవు. కర్నాటకలోని ధార్వాడ ప్రాంతంలో ఆయన గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. హనుమంతప్ప బతికే ఉన్నాడన్న సమాచారాన్ని ఆయన కుటుంబసభ్యులకు పోలీసులు చేరవేశారు. ఈ సందర్భంగా మంగళవారం హనుమంతప్ప భార్య మాధవి విూడియాతో మాట్లాడుతూ తన భర్తకు పునర్జన్మ వచ్చినట్లుందని అన్నారు. చాలా సంతోషంగా ఉందని.. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేని ఆమె అన్నారు.

సియాచిన్‌ గ్లేసియర్‌లో ఆరు రోజుల క్రితం.. పది మంది సైనికులు హిమపాతం బారిన పడినఘటనలో హనుమంతప్ప కూడా ఉన్నారు.  వారందరూ మరణించినట్టు ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది కూడా! కానీ.. 25 అడుగుల మేర పేరుకుపోయిన మంచు కింద ఆరు రోజులుగా కూరుకుపోయినా.. సంకల్ప బలంతో ప్రాణాలు నిలుపుకొన్నాడు కర్ణాటకకు చెందిన లాన్స్‌నాయక్‌ హనుమంతప్ప. అవలాంచ్‌లో ఇరుక్కున్న సైనికుల కోసం సైన్యం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా మంచును తొలగిస్తుండగా హనుమంతప్ప కనిపించాడు. అతడింకా ప్రాణాలతోనే ఉన్నాడని గుర్తించి ఆస్పత్రికి తరలించినట్టు లెఫ్టినెంట్‌ జనరల్‌ డీఎస్‌ హుడా తెలిపారు. కాగా, హిమపాతానికి గురైన మిగతా తొమ్మిది మందిలో ఐదుగురి మృతదేహాలు దొరికాయని, వారిలో నలుగురి వివరాలు తెలిశాయని హుడా వివరించారు.