ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు
నిజామాబాద్, నవంబర్ 9 విద్యార్థులు ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని హైకోర్టు జడ్జి బి.చంద్రకుమార్ స్పష్టం చేశారు. కన్న తల్లితండ్రులను, విద్యాబుద్ధులను నేర్పిన గురువులను విద్యార్థులు గౌరవించాలని ఆయన సూచించారు. హైకోర్టు జడ్జీ శుక్రవారం బాసర మీదుగా ఎడపల్లికి చేరుకున్నారు. బోధన్ మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో మండల శివారులో గల గురుకుల పాఠశాలలో నిర్వహించిన జాతీయ న్యాయసేవా సదస్సు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి కలెక్టర్లుగా, ఎస్పీలుగా, ఇంజనీర్లుగా, న్యాయమూర్తులుగా వివిధ ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. వరకట్నం నిర్మూలనకు, వరకట్నం మరణాలను అరికట్టాలన్నారు. అనంతరం మండలంలోని పోచారం గ్రామంలో గల అంతర్జాతీయ జ్ఞాన విపచన కేంద్రాన్ని హైకోర్టు జడ్జీ సందర్శించారు. అక్కడ కొద్దిసేపు జ్ఞానముద్రలో ఉన్నారు. కేంద్రం పరిసర ప్రాంతాలు ఆహ్లాదకరంగా ఉన్నాయని, జ్ఞానబోధకు ఈ కేంద్రం ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు జడ్జీ వెంట ఏడో అదనపు జిల్లా న్యాయమూర్తి రమేష్, ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఖయ్యూమ్‌హుస్సేన్, తహసీల్ధార్ అర్చన, ఎంపిడివో వేణుగోపాల్, గురుకులం ప్రిన్సిపల్ కిషన్, కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ సీమా పర్విన్ తదితరులు ఉన్నారు.