ధైర్యే సాహసే లక్ష్మి
ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యం చేస్తేనే ఏదైనా సిద్దిస్తుంది. ధైర్యవంతుడి వద్ద్నే లక్ష్మి ఇవాసం ఉంటుంది. పిరికివాడిని లక్ష్మి కూడా కనికరించదు. పుట్టుకతోనే ఎవరూ ధైర్యసాహసాల్ని వెంట తెచ్చుకోరు. పరిస్థితులు, అనుభవాలే మనిషిని అలా తీర్చిదిద్దుతాయి. ధైర్యవంతుల్ని ఎవరైనా ఆరాధిస్తారు. వారితో ఎప్పుడూ సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. అటువంటి ఆత్మవిశ్వాసం తమకూ ఉంటే బాగుంటుందని అనుకుంటారు. ఏ మనిషికైనా ధైర్యం లోపలి నుంచి రావాలి. అలాగని కొంతమంది మాత్రమే ధైర్యవంతులని అనుకోరాదు. ధైర్యసాహసాలు పుట్టుకతోనే వస్తాయని భావించకూడదు. మంచి పనులు చేసేవారికి సహజంగానే ధైర్యం ఉంటుంది. ఉండాలి కూడా. మంచిచేసేవారికి దైవ ఆశీర్వచనమే ధైర్యం రూపంలో లభిస్తుంది. దానికి సాహసం జతపడితే, జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ధైర్యంచేస్తేనే విజయం లభిస్తుందని పురాణ గాథలు చెబుతాయి. ఇతరులెవరూ చేయలేనిది చేయడమే ధైర్యం! తాను నమ్మినదానివిూద నిలబడాలంటే, మనిషికి ధైర్యగుణం ఉండి తీరాలి. మానసిక ధైర్యం అన్నింటికంటే గొప్పది. అదే నిజమైనది. దేశరక్షణ కోసం- కుటుంబసభ్యులకు దూరంగా, ఎండలో వానలో చలిలో సరిహద్దుల వద్ద విధులు నిర్వర్తిస్తారు వీరసైనికులు. వారి సాహసం తిరుగులేనిది. దాన్ని తలచుకుంటూ, అందరూ ధైర్యంగా ఉండాలి. దైర్యమే జీవితమని తెలుసుకొని మసలాలి! ఏ పని చేయాలన్నా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలగాలి. అపజయం ఎదురైనా ధైర్యం కోల్పోకపోతేనే విజయం సాధిస్తాం. అందుకే విజయం సాధించివారి చరిత్ర చూస్తే ధైర్యమే మనకు సాక్షాత్కరిస్తుంది. రామయాణ,మహాభారత కథల్లో ధైర్యమే అంతిమ విజయంగా మనకు కనిపిస్తుంది.