నంద్యాలలో డబ్బుతో గెలిచారు

 

 

 

వచ్చే ఎన్నికల్లో ఇదే ప్లాన్‌తో వెళతామనడం సిగ్గుచేటు: వైకాపా

హైదరాబాద్‌,ఆగస్ట్‌30 : నంద్యాల ఉప ఎన్నికలో డబ్బులు వెదజల్లడం వల్ల్నే టిడిపికి గెలుపు సాధ్యమయ్యిందే తప్ప నిజాయితీగా గెలిచింది కాదని వైఎస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి పార్ధసారధి అన్నారు. నంద్యాలను నమునాగా తీసుకుని ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పార్ధసారధి అన్నారు. ఉప ఎన్నిక గెలుపు కోసం టీడీపీ రూ.200 కోట్లు ఖర్చు పెట్టిందని ఆయన విమర్శించారు. ఓటరు మెడపై కత్తిపెట్టి, ప్రలోభపెట్టి గెలవడం నమూనా ఎలా అవుతుందని పార్థసారధి సూటిగా ప్రశ్నించారు. ఇకముందు ఇలాగే చేస్తారని ఇప్పుడు బాబు చెబుతున్నారని అన్నారు. 75 నియోజకవర్గాలకు వచ్చే ఎన్నికలలో రూ.35వేల కోట్లు ఖర్చు పెట్టడమే నంద్యాల నమూనానా అని అన్నారు. పెన్షన్లు,రేషన్‌ రద్దు చేస్తాం అని చెబుతూ చేతిలో 6000 పెట్టి రాష్ట్రమంతా ఓట్లడుగుతారా? రాష్ట్రవ్యాప్తంగా నంద్యాల మోడల్‌ అంటే ఇదేనా అంటూ ప్రశ్నలు సంధించారు. నంద్యాల మోడల్‌ 2019 ఎన్నికల్లో టీడీపీని ఇంటికి పంపిస్తుందన్నారు. రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసి చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికపై దృష్టి పెట్టారని మండిపడ్డారు.

వైఎస్‌ఆర్‌ సీపీకి ఓటేసిన 70వేలమంది ఓటర్లకు సెల్యూట్‌ చేస్తున్నామని, నంద్యాల ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హావిూలు అమలు చేయకపోతే చూస్తూ ఊరుకోమని పార్థసారధి హెచ్చరించారు. టీడీపీ నేతలకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానంలో ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు. నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అధికార బలంతోనే విజయం సాధించిందని, ఓటర్లను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారని అన్నారు. ప్రజలకు కూడా ఈ విషయం తెలుసని అన్నారు. నంద్యాల ఎన్నికలో కోట్లాది రూపాయలను ఖర్చుపెట్టి అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడి విజయం సాధించారని విమర్శించారు. రోడ్లపై నడవనిచ్చేది లేదని, పింఛన్లు నిలిపివేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఉప ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధితో కాకుండా భూమా దంపతుల సానుభూతితో గెలుపొందిందని చెప్పారు. నంద్యాలలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా అధికార పార్టీ వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. టీడీపీ చేసిన అభివృద్ధితోనే గెలిచామని చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు చెప్పగలరా? అని ప్రశ్నించారు.