నకిలీ పోలీస్ అధికారి ఆటకట్టు
విఐపి దర్శనం చేసుకున్నాక పట్టివేత
శ్రీశైలం,సెప్టెంబర్5 ( జనం సాక్షి ) : పోలీసు అధికారినంటూ ఓ వ్యక్తి నకిలీ ఆర్‌ఎస్‌ఐ అవతారమెత్తాడు. శ్రీశైలం ఆలయంలో దర్జాగా వీఐపీ దర్శనం చేయించుకున్నాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. శ్రీశైలంఒకటో పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌కు చెందిన కుసుమ ప్రశాంత్ ఈ నెల ఒకటిన శ్రీశైలం ఆలయానికి వచ్చాడు. తాను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఆర్‌ఎస్సైగా పనిచేస్తున్నట్లు శ్రీశైలం పోలీసులను పరిచయం చేసుకున్నాడు. తనకు వసతి గది, వీఐపీ దర్శనం ఏర్పాటు చేయాలని కోరాడు. అది నిజమని నమ్మిన పోలీసులు కుసుమ ప్రశాంత్‌కు స్వామి, అమ్మవార్ల దర్శనం, వసతి ఏర్పాటు చేశారు.
కానీ ఆ తర్వాత కుసుమ ప్రశాంత్ తీరుపై వారికి అనుమానం వచ్చింది. ఈక్రమంలో శ్రీశైలం ఒకటో పట్టణ సీఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. అతడిని నకిలీ ఆర్‌ఎస్సైగా గుర్తించారు. నంద్యాల పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితుడిపై కేసు నమోదు చేయడంతో పాటు అతడి వద్దనున్న నకిలీ పోలీసు గుర్తింపు కార్డు, కారు, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు. ప్రశాంత్ గతంలోనూ తెలంగాణలో పలు మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. నకిలీ పోలీసు అధికారిగా చెప్పుకొని ఒక వ్యక్తి నుంచి రూ.40 వేలు వసూలు చేయడంతో ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్‌లో అతడిపై కేసు నమోదైందని చెప్పారు.