నకిలీ విత్తనాలకు తోడయిన వర్షాలు

అన్నదాతను కుదేలు చేసిన పంటలు
భారీగా పెట్టబడులు నష్టపోయిన రైతులు

నిజామాబాద్‌,జూలై19(జనంసాక్షి): సీజన్‌ మొదట్లోనే నకిలీ విత్తనాలు అన్నదాతలను నట్టేట ముంచగా, భారీ వర్షాలకు మొలకెత్తిన పంటలను సైతం ముంచెత్తాయి. ముసురుతో దెబ్బతిన్న ఆరుతడి పంటలు దెబ్బ తిన్నాయి. జిల్లాలో గత వారం రోజుల నుంచి ఎడతెరపి లేకుండా ముసురు కమ్మేసిన కారణంగా జిల్లా అంతటా విస్తారంగానే వర్షాలు కురిసాయి.జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో సుమారు రెండున్నర లక్షల ఎకరాలకు పైగా పత్తి, సోయా, మొక్కజొన్న, మినుము, పెసర, కంది లాంటి ఆరుతడి పంటలను రైతులు విస్తారంగా సాగు చేశారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఆరుతడి పంటల చేనుల్లో భారీగా వరద నీరు నిలిచిపోతుంది. ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్న ఆరుతడి పంటలు నీట మునగడంతో నష్టం నెలకొననుంది.
రెండు లక్షల ఎకరాలల్లో వరిపంట సాగవుతుండగా మిగతా రెండున్నర లక్షల ఎకరాలల్లో పత్తి, సోయా, మొక్కజొన్న, పప్పుదినుసు పంటలు సాగవుతున్నాయంటే ఆరుతడి పంటలను రైతులు ఏ స్థాయిలో వేస్తుంటారో అర్థమవుతుంది. జిల్లాలో సుమారు 20వేల ఎకరాలల్లో సోయా మొలకెత్తలేదని రైతులు చెబుతున్నారు. ఇక ప్రైవేట్‌ కంపెనీలు మార్కెట్‌లో సరఫరా చేసే పత్తి విత్తనాల సంగతి చెప్పనవసరం లేదు. వేల రూపాయలు ఖర్చు చేసి పత్తి విత్తనాలు కోనుగోలు చేయగా వాటిని విత్తేందుకు, సాగు
చేసేందుకు రైతులు తీవ్రంగా ఖర్చు చేస్తుంటారు. అవి సైతం మొలకెత్తక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,10,340 ఎకరాలల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా వరి 1.50లక్షల ఎకరాలల్లో సాగయింది. మొక్కజొన్న 59వేల ఎకరాలల్లో, సోయాబిన్‌ 67వేలు, పత్తి 24వేలు, కందులు 17వేలు, మినుములు 5,500, పెసర్లు 8,700, చెరుకు 4,600 ఎకరాలల్లో పంటలు సాగయ్యాయి.మొదట్లో నట్టేట ముంచిన నకిలీ విత్తనాలుజిల్లాలో అన్నదాతలు ఆరుతడి పంటలైన పత్తి, సోయా, మొక్కజొన్న, కందులు, మినుములు, పెసర పంటలను విస్తారంగా సాగు చేస్తుంటారు. నీటి వనరులు తక్కువగా ఉండడంతో వర్షాలపై ఆధారపడి ప్రతీఏటా ఈ పంటలను లక్షల ఎకరాలల్లోనే వేస్తుంటారు. ప్రధానంగా మద్నూర్‌, జుక్కల్‌, పిట్లం, బిచ్కుంద, గాంధారి, సదాశివనగర్‌, తాడ్వాయి, రాజంపేట, నస్రుల్లాబాద్‌ తదితర మండలాల్లో ఈ పంటలు ఎక్కువగా సాగవుతుంటాయి. ఈ ఏడాది నకిలీ విత్తనాలైన సోయా, పత్తి రైతులను నట్టేట ముంచాయి. ఈ సారి ప్రభుత్వం సోయా విత్తనాలు సరఫరా చేయకపోవడంతో రైతులు పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేయడంతో నాణ్యత లేకపోవడం వల్ల ఆ విత్తనాలు కాస్తా మొలకెత్తలేదు. ఇలా బిచ్కుంద, పిట్లం, జుక్కల్‌, మద్నూర్‌, గాంధారి, సదాశివనగర్‌, తాడ్వాయి, రాజంపేట మండలాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా చెరువులు అలుగు పోస్తున్నాయి. ఈ వరద స్థానికంగా ఉన్న పంట పొలాలు, చేన్లలోకి చేరుతుండడం, వర్షపు నీరు నిలుస్తుండడంతో ఆరుతడి పంటలు నీట మునిగిపోయాయి. ప్రధానంగా పత్తి, సోయా, పప్పుదినుసు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.