నగదు బదిలీ కొత్తది కాదు : కేంద్రం

న్యూఢిల్లీ : వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల బ్యాంక్‌ఖాతాల్లో నేరుగా రాయితీ మొత్తం బదిలీకి ఉద్దేశించిన నగదు బదిలీ పథకంపై ఎన్నికల సంఘానికి కేంద్రం వివరణ ఇచ్చింది. ఈ పథకం కొత్తేమీకాదని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ఉందని పేర్కొంది. గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌శాసనసభల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకే కేంద్రం ఈ నగదు బదిలీ పథకాన్ని ప్రకటించిందని, దీన్ని నిలిపివేయాలని భారతీయ జనతా పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో సోమవారం సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని లేదంటే చర్యలు తీసుకోవలసి ఉంటుందని కేంద్రాన్ని ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే.ఈసీ హెచ్చరిక నేపథ్యంలో ఈ నగదు బదిలీ పథకం వివరాలను ప్రణాళిక సంఘం అందజేసింది. ప్రభుత్వ ప్రకటన కొత్తది కాదని పేర్కొంది. ఈ అంశంపై పూర్తివివరాల కోసం ప్రణాళికా సంఘానికి నివేదించామని కేంద్రమంత్రివర్గ కార్యదర్శి అజిత్‌ సేథ్‌ వివరణను ఈసీకి అందించారు. ఈసీలో ఎన్నికల ప్రధాన అధికారి విఎస్‌ సంపత్‌నాయకత్వంలోని త్రిసభ్య కమిటీ కేంద్ర ప్రభుత్వ వివరణపై చర్చించి నిర్ణయాన్ని వాయిదా వేసింది. జనవరి 1, 2013 నుంచి 51 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలయ్యే ఈ పథకంలో గుజరాత్‌కు చెందిన నాలుగు జిల్లాలున్నాయి. టెలికాం మంత్రి కపిల్‌ సిబాల్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించలేదన్నారు. పూర్వపు ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ఈ పథకం గురించి బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించిందన్నారు.