నగరంలో ఇస్లామిక్ ఉగ్రవాదుల తిష్ట
ముగ్గురిని అరెస్చ్టేసిన యూపి పోలీసులు
హైదరాబాద్,సెప్టెంబర్9(జనంసాక్షి): నగరంలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) జాడలు కనిపించడం కలకలం రేపింది. నగరంలో ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను యూపి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బండ్లగూడ సవిూపంలోని సన్‌సిటీలో పోలీసులు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. అబ్దుల్ మాలిక్, అతని కుమారులు ఫజుల్లా, ఖయ్యూం అనే ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా వారి నుంచి నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా… వీరు ఇంటర్నెట్ ద్వారా ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిని ఉత్తరప్రదేశ్ పోలీసులకు స్థానిక పోలీసులు అప్పగించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేయడంతో నగరంలో వీరి కదలికలు ఉన్నాయని రుజువు చేస్తోంది.
రాజేంద్రనగర్ లోని సన్ సిటీ వద్ద ఉగ్రవాది అబ్దుల్ ఖయ్యూంను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాది ఖయ్యూంను అరెస్టు చేసిన పోలీసులు.. లక్నోకు తరలించారు. తీవ్రవాద కార్యకలాపాలు చేపడుతున్న ఖయ్యూం కోసం గత కొంతకాలంగా పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఖయ్యూం ఎంత కాలం నుంచి నగరంలో నివాసం ఉంటున్నాడనే విషయంపై హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ఆరా తీస్తున్నారు. గత నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఖయ్యూంకు ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఖయ్యూంకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అయితే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు శనివారం ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టుచేశారని అంటున్నారు. టోలీచౌక్ ప్రాంతంలో అబ్దుల్ మాలిక్, ఫజులుల్లా, ఖయ్యూం అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాల విషయమై ఈ ముగ్గురిని ఎన్‌ఐఏ అధికారులు ప్రస్తుతం విచారిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో వీరు ప్రధానంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి తప్పించుకుని నగరంలో తిష్టవేశారని సమాచారం. లక్నో నుంచి వచ్చిన ఎన్‌ఐఏ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో ఉదయం టోలిచౌక్‌లోని వీరి నివాసంపై దాడులు చేసి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఐసిస్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, వారి కార్యకలాపాలకు సహకరించడం వంటి చర్యలకు వీరు పాల్పడ్డట్టు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. వీరికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.