నగరంలో డాక్టర్ల కాల్పుల కలకలం
హైదరాబాద్,ఫిబ్రవరి 8(జనంసాక్షి): గ్రేటర్ ఎన్నికల హడావుడి నుంచి ఇప్పుడిప్పుడే సేదతీరునున్న హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం హఠాత్తుగా కాల్పులు చోటుచేసుకున్నాయి. నగరం నడిబొడ్డులోగల హిమాయత్ నగర్ ఆరో నంబర్ వీధిలో ముగ్గురు వైద్యుల మధ్య తలెత్తిన వివాదం చివరికి కాల్పులకు దారితీసింది. ఒక్కసారిగా బుల్లెట్ శబ్ధాలు వినిపించడం స్థానికులను కలవరపాటుకు గురిచేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించేపనిలో ఉన్నారు. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం సంఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు డాక్టర్లు మాదాపూర్ లోని గ్లోరియల్ హాస్పిటల్ డైరెక్టర్ల సమావేశంలో గొడవ పడ్డారు. సమావేశం ముగిసిన తర్వాత ముగ్గురూ కలిసి మాదాపూర్ నుంచి కారులో బయలుదేరారు. హిమాయత్ నగర్ వద్దకు చేరుకున్న తర్వాత డాక్టర్ ఉదయ్.. డాక్టర్ శశికుమార్ పై కాల్పులు జరిపాడు. గాయపడ్డ వైద్యుడు ప్రస్తుతం హైదర్ గూడాలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డైరెక్టర్ల సమావేశానికి వెళ్లేటప్పుడే డాక్టర్లలో ఒకరు ఆయుధం కలిగి ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఉదయ్‌కుమార్, శశికుమార్‌లు ఇద్దరూ వైద్యులు. ఆస్పత్రి లావాదేవీలకు సంబంధించి వీరి మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించిన ఇరువురు ఒకరిపై ఒకరు కాల్పులకు దిగారు. హిమాయత్‌నగర్ వీధి నెం.6లోని రాజా రెసిడెన్షిలో ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు గాయపడిన వైద్యులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారి మధ్య గొడవ ఎందుకు జరిగింది… కాల్పులకు దారితీసిన ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు సవిూక్షిస్తున్నారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.