నగరబుద్ధిజీవులు శాంతి కోసం నడుం కట్టండి
– అభివృద్ధిలో పాలుపంచుకోండి
– ఉన్మాదగద్ధలను తరిమికొట్టండి
– హైదరాబాద్ అభివృద్ది కోసం మరోమారు దీవించండి
– ప్రజలంతా టిఆర్‌ఎస్‌కే ఓటేసి మద్దతు తెలపాలి
– అన్ని వర్గల వారు మళ్లీ ఆశీర్వదించి పంపండి
– హైదరాబాద్‌ను వరదలు లేని నగరంగా తీర్చి దిద్దుతా
– మూసీ మురికి పారదోలి అద్భుతంగా మారుస్తా
– వరదసాయం తిరిగి 7నుంచి ప్రారంభిస్తాం
– అపార్ట్‌మెంట్ వాసులకూ నీటిసరఫరా ఫ్రీ
– వరదసాయం ఇవ్వని వారు వరదల్లా హైదరాబాద్‌పై పడ్డారు
– బక్క కెసిఆర్‌ను కొట్టడానికి ఇంతమంది రావాలా
– తెలంగాణ ఏర్పడ్డప్పుడు పాలనే చేతగాదన్నారు
– ఇవాళ అద్భుతంగా పాలన చేసి చూపిస్తున్నాం
– 24గంటల కరెంట్ వెనక ఎంత తపన ఉందో గుర్తించండి
– జీహెచ్‌ఎంసీ ఎన్నికల బహిరంగ సభలో సీఎం కేసీఆర్
హైదరాబాద్,నవంబరు 28(జనంసాక్షి): ఆగిపోయిన వరదసాయాన్ని వచ్చే నెల 7నుంచే ప్రారంభిస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. అలాగే అపార్ట్‌మెంట్ వాసులకు కూడా ఉచిత నీటిసరఫరాను అందచేస్తామని అన్నారు. హైదరాబాద్ అభివృద్దికి ప్రజలంతా గంపగుత్తగా టిఆర్‌ఎస్‌కు ఓటేసి గతంకన్నా ఎక్కువ సీట్లు సాధించి పెట్టాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఎన్నో ఏళ్లుగా ప్రశాంతంగా ఉంటోందని, ఇక్కడ గెలుపుతో దేశరాజకీయాలను శాసించే శక్తిని ఇవ్వాలన్నారు. వరదసాయం కోసం పైసా ఇవ్వని వారు వరదల్లా హైదరాబాద్‌లో ప్రచారానికి మాత్రం వస్తున్నారని విమర్శించారు. ఒక్క బక్క కెసిఆర్‌ను కొట్టడానికి ఇంతమంది రావాలా అని ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఎల్బీ స్టేడియంలో టిఆర్‌ఎస్ నిర్వహించి న భారీ బహిరంగ సభలో పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ ఉద్వేగంగా మాట్లాడారు. సమకాలీన రాజకీయాలు, తెలంగాణ ఆవిర్భావం,అభివృద్ది, జాతీయ రాజకీయాలపై తన అభిప్రాయాలన్ని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్, బిజెపిల రాజకీయాలను నిలువరించేందుకు తనకు శక్తి ఇవ్వాలన్నారు. దేశ సంపదను దేశానికి పంచాల్సిన అవసరం ఉందన్నారు. తపన, సంకల్పం, కార్యాచరణ ఉన్న ప్రభుత్వం మాదని సీఎం కేసీఆర్ అన్నారు. డిసెంబర్ 7 నుంచే మళ్లీ వరదసాయం అందిస్తామని చెప్పారు. హైదరాబాద్ వరదలు చూసి చలించిపోయా. లక్షల మంది పేదల బతుకులు ఆగమవడం చూసి చాలా బాధపడ్డాను. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు సాయం అందజేశాం. డిసెంబర్ 7 తర్వాత వరద సాయం అందని వారికి తిరిగి అందిస్తాం. హైదరాబాద్ ప్రజలకు హావిూ ఇస్తున్నా.. మరో రూ.300 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వెనుకాడదన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ సాయం అందిస్తాం. ప్రధానిని రూ.1300 కోట్ల సాయం అడిగితే 13 పైసలు కూడా ఇవ్వలేదు. మేం భారతదేశంలో లేమా అని అన్నారు. బెంగళూరు, అహ్మదాబాద్ నగరాలకు సాయం ఇవ్వలేదా అని కేసీఆర్ ప్రశ్నించారు. 20 వేల లీటర్ల వరకు నల్లా బిల్లులు రద్దు చేశాం.. ఢిల్లీ తర్వాత దేశంలో తెలంగాణలో మాత్రమే నల్లా బిల్లులు రద్దు చేసింది. అలాగే దీన్ని అపార్ట్‌మెంట్లకూ వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. హైదరాబాద్ చాలా చైతన్యవంతమైన నగరమని, ఓట్లు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ కోసం నాయకుడి ప్రణాళికలపై నిర్ణయం తీసుకోవాలని.. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నారు. అపోహలు, అనుమానాలపై సుదీర్ఘపోరాటం ద్వారా తెలంగాణ సాధించుకున్నాం. కరెంట్ ఉండదు, నీళ్లు రావు, పరిశ్రమలు వెళ్లిపోతాయన్నారు. హైదరాబాద్ ఖాళీ అవుతుందని శాపాలు పెట్టారు. అందరి అంచనాలను తలక్రిందలు చేసి అభివృద్ధి సాధించాం. హైదరాబాద్‌లో ఉన్న ప్రతి బిడ్డా.. మా బిడ్డే. ఎక్కడా కుల, మత, ప్రాంతీయ వివక్షలు లేకుండా ముందుకెళ్లాం. కరెంట్ సమస్యను పరిష్కరించాం. 24 గంటలూ కరెంట్ ఇస్తున్నాం. ఏరోజు మేం పక్షపాత నిర్ణయాలు చేయలేదు. అంచనాలను మించి మిషన్ భగీరథను విజయవంతం చేశాం.రాష్ట్ర ప్రజలకు 24గంటలూ మంచినీరు ఇవ్వాలన్నదే నా లక్ష్యం. ఢిల్లీ, నాగపూర్‌లలో ఇప్పటికే అధ్యయనం చేశాం. కల్యాణలక్ష్మీ, కంటి వెలుగు, కేసీఆర్ కిట్ పథకాలు ఎక్కడా లేవని ఆయన పేర్కొన్నారు. వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతా అని అన్నారు. వరదసాయం చేయాలని నన్ను ఎవరూ అడగలేదు. వరదలు వచ్చిన ఏ నగరంలోనూ ప్రభుత్వాలు సాయం చేయలేదు. వరదసాయం చేస్తుంటే కొందరు కిరికిరి పెట్టారు. ఏ నగరంలోనూ ఇవ్వని విధంగా 6.5లక్షల మందికి 650 కోట్లు ఇచ్చాం. ఈసీకి ఫిర్యాదు చేసి కొందరు వరదసాయం బంద్ చేయించారు. ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్ లోనూ వరదలు వచ్చాయి. మంత్రులంతా మోకాళ్లలోతు నీళ్లలో తిరిగారు. కొందరి కోసం పనిచేసి అందరినీ ఆగం చేయమని అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా..సంక్షేమ పథకాలు ఆపలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత మా ప్రభుత్వమే ఉంటుంది. శాంతిభద్రతల విషయంలో ఆరేళ్లుగా రాజీపడ లేదు. నగరంలో రౌడీమూకలను అణచివేశాం. హైదరాబాద్‌లో ఉన్న సీసీ కెమెరాలు దేశంలో ఎక్కడా లేవని సీఎం పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో భాగ్యనగరవాసులకు తానొక్కటే విజ్ఞప్తి చేస్తున్నట్లు టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్ ప్రగతి శంఖారావం సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సభకు విచ్చేసిన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ.. అందరికీ తానొకటే మాట విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు చాలా జరుగుతుంటాయి. సందర్భాలు చాలా వస్తుంటాయి.. పోతుంటాయన్నారు. ఎన్నికల్లో విచక్షణ అధికారాన్ని వినియోగించి పార్టీలకు ఓటేసే ముందు ప్రజలు ఆలోచించాలని కోరారు. ఒక పార్టీ, ఒక ప్రభుత్వం, ఒక నాయకుడు ఎలా ఆలోచిస్తున్నారు. ఎలా పనిచేస్తున్నారు. వాళ్ల దృక్పథం ఎలా ఉంది. వాళ్ల వైఖరి ఏ విధంగా ఉంది. వాళ్లు ఏ విధంగా అభివృద్ధిపై ఆలోచిస్తున్నారు. భవిష్యత్తు కోసం వాళ్లు అవలంబిస్తున్న విధానాల విూద చర్చ జరగాలన్నారు. ప్రజలకు సేవ చేయడంలో పోటీతత్వం పెరుగుతుంది. తద్వారా సమాజానికి, ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అవలంబిస్తున్న పద్ధతి ఇదేనని సీఎం పేర్కొన్నారు. ఇకపోతే టీఆర్‌ఎస్ ఉద్యమ బాధ్యత ముగిసింది, రాజకీయ పరిణతి సాధించిందని పేర్కొన్నారు. ‘హైదరాబాద్ గడ్డపై ఉన్న ప్రతి బిడ్డా మావారే అని చెప్పాం. దేశం నలుమూలల నుంచి వచ్చిన వారిని మా బిడ్డలుగానే చూస్తున్నాం. హైదరాబాద్ చైతన్యవంతమైనది..చరిత్ర ఉన్నది. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్‌వన్ అని కేంద్రం చెప్పింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మనం సాధించిన తొలి ఘనత విద్యుత్. తాగునీటి సమస్యకు భరతవాక్యం పలికాం. ఎంతో కృషి, పట్టుదలతో కోతలు లేని విద్యుత్ అందిస్తు న్నామని సీఎం చెప్పారు. ఇకపోతే హైదరాబాద్ అభివృద్దికి ప్రతి బ్జడెట్‌లో హైదరాబాద్‌కు 10 వేల కోట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. చేతులు ఊపినంత మాత్రాన సమస్య పోదని చెప్పారు. వరదల నుంచి హైదరాబాద్‌కు శాశ్వత విముక్తి కల్పిస్తామని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఉన్న పరిశ్రమలను తరలిస్తాం, కాలుష్యాన్ని తొలగిస్తాం. మెట్రో రైల్‌ను పొడిగిస్తాం. ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలును విస్తరిస్తామన్నారు. హైదరాబాద్ అశాస్త్రీయంగా పెరిగింది, ఇప్పుడు చర్చ అనవసరం. హైదరాబాద్‌లో జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి. కేంద్రానికి ఎన్నో సార్లు చెప్పినా పట్టించుకోలేదని కేసీఆర్ అన్నారు. ఇకపోతే హైదరాబాద్ రాబోయే కొద్ది నెలల్లో హైదరాబాద్ నగరానికి 24 గంటలు నీళ్లు సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని..మరోసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిపించండి అని కేసీఆర్ కోరారు. ఐదేళ్లలో మిషన్ భగీరథ పూర్తి చేశాం. మేం ఇస్తున్న రైతుబంధు ఏ రాష్ట్రంలోనైనా ఉందా? ప్రతీ రైతు కుటుంబానికి రూ.5లక్షల రైతుబీమా అమలు చేస్తున్నాం. యావత్ నగర ప్రజల కోసం 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. కులమతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నాం. కల్యాణలక్ష్మీ, కంటి వెలుగు పథకాలు ఎక్కడా లేవు. కేసీఆర్ కిట్ అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నాం. కేసీఆర్ కిట్టు..సూపర్ హిట్టు’ అని కేసీఆర్ పేర్కొన్నారు. దోబీఘాట్లు, సెలూన్లకు ఉచిత విద్యుత్ ఇస్తాం.దేశంలో ఎక్కడాలేని విధంగా వెయ్యి గురుకుల పాఠశాలలు ప్రారంభించాం. కరోనాతో రాష్ట్రానికి రూ.52వేల కోట్ల ఆదాయం కోల్పోయినా ఎక్కడా సంక్షేమ పథకాలు ఆపలేదని సిఎం కెసిఆర్ తెలిపారు. కుల, మత, జాతి, ప్రాంత వివక్ష లేకుండా తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తెలిపారు. మన హైదరాబాద్ నగరం చాలా చైతన్యవంతమైన నగరం. చాలా చరిత్ర ఉన్న నగరం. ఎన్నో మంచి చెడులకు సాక్ష్యంగా ఉన్న నగరం. చాలా చాలా కష్టపడ్డాం. వాదాలు, అపవాదాలు, చిత్రచిత్రమైన వాదాలు, అపోహలు, అనుమానాలు, అనేక చర్చోపచర్చలు, అనేక విషయాల మధ్య తాను 2001లో ప్రారంభించి 14-15 ఏళ్ల సుదీర్ఘ పోరాటాల అనంతరం మనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. చాలా అపనమ్మకాలు, పరిపాలన చేతకాదన్నారు. తెలివితేటలు లేవన్నారు. విూకు నీళ్లు రావు.. ఇబ్బందులపాలైతరని ఇంకొంతమంది. పంటలు పండించడం చేతకాదు దెబ్బతింటరని మరికొంతమంది. ప్రాంతీయవాదం పెచ్చువిూరుతది. నక్సలైట్లు చెలరేగుతరని అన్నారు. ఇన్ని అనుమానాల మధ్య రాష్ట్ర ప్రజానీకం టీఆర్‌ఎస్ పార్టీని నమ్మి దీవిస్తే ఫలితాలు నేడు ప్రజల కళ్లముందే ఉన్నాయన్నారు. అందరి అంచనాలను తలక్రిందులు చేసి ఏ రకమైన కార్యక్రమాలను టీఆర్‌ఎస్ తీసుకుందో, ఏరకంగా పురోగమిం చిందో.. ఏ రకమైన సోదర సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే హైదరాబాద్‌లో గానీ రాష్ట్రంలో గానీ కుల, మత, జాతి, ప్రాంత వివక్ష లేకుండా ఎటువంటి నైపుణ్యాన్ని, ఎటువంటి మెచ్యురిటీని, ఎంత గంభీరంగా ఈ ఆరేండ్లుగా ఆచరించి చూపిందో విూ ముందు ఉంది. ఈ హైదరాబాద్‌లో ఉన్న బిడ్డ మా బిడ్డే అని చెప్పి అదేవిధంగా సంరక్షించుకుంటూ వస్తున్నాం. ఈ ఆరేండ్లుగా విూరే చూస్తున్నారు. ఎవరూ ఊహించని విజయాలను సాధించామని కెసిఆర్ వివరించారు. తెలంగాణ కావాలని పడ్డ తపన ఫలితంగా ఏడు, ఎనిమిది మాసాల్లోనే పరిస్థితులు తలక్రిందులై నేడు బ్రహ్మండంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. ఈ రోజు జనరేటర్లు, ఇన్వెర్టర్లు, కన్వెర్టర్లు లేవు. ఇది తెలంగాణ సాధించిన మొట్టమొదటి విజయం అన్నారు. భారతదేశ తలసారి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలిచింది. ఇది కేంద్రమే చెప్పింది. దీనిక వెనుక ఎంత కృషి ఉందో విూరు ఆలోచించాలి. పరిపాలనలో టీఆర్‌ఎస్ పార్టీ ఇతర రాష్ట్రాలకు, పార్టీలకు ఆదర్శంగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు. నాయకుల ఆలోచనలు, పనితీరు చూసి ఓటేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఓటు వేసే ముందు ప్రజలు విచక్షణతో ఆలోచించాలన్నారు. ఇప్పటికే అందరి అంచనాలను తలకిందులు చేసి ఎలాంటి వివక్షత లేకుండా ఆరేళ్లలో అభివృద్ధి చేసి చుపించానని, దీనిని కొనసాగించాలంటే మళ్లీ టిఆర్‌ఎస్‌ను గెలిపించాలన్నారు. ఈ సభలో మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు పాల్గోన్నారు. పార్టీ అభ్యర్థులను సబకు పరిచయం చేశారు. ఈ సందర్బంగా తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూల్లో ఆయన ప్రసంగం కొనసాగడం విశేషం.