నగర కమిటీలో అన్ని వర్గాలకు సముచితస్థానం

నిజామాబాద్‌, నవంబర్‌ 27  చురుకైన కార్యకర్తలను నగర కాంగ్రెస్‌ కమిటీలో నియమించామని, ఈ కమిటీలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించామని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు గంగాధర్‌ అన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో నగర కమిటీ సభ్యత్వ నమోదును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగర కాంగ్రెస్‌ కమిటీలో నియమించిన కార్యకర్తలు చురుకుగా పనిచేసి కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి  చేయాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చని. మరోమారు నిజామాబాద్‌ నగర కార్పొరేషన్‌పై కాంగ్రెస్‌ జెండాను ఎగురవేస్తామని ఆయన వెల్లడించారు. నగర అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు నగరంలో అత్యధికంగా సభ్యత్వ నమోదు చేస్తామని, ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి రత్నాకర్‌, వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ నగేశ్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు బలరాం, రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.