నగర సుందరీకరణపై ప్రణాళిక
– పలు వంతెనల నిర్మాణంపై చైనా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ
హైదరాబాద్,జనవరి22(జనంసాక్షి): చైనా నిర్మాణ సంస్థ అన్జు ప్రతినిధి బృందంతో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. ఇవాళ తన అధికార నివాసంకు వచ్చిన ప్రతినిధులతో సమావేశమై హైదరాబాద్ నగర సుందరీకరణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా చైనా ప్రతినిధులు తెలంగాణలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన వంతెనలు, టన్నెళ్లు, పంపు హౌజ్‌ల నిర్మాణం తక్కువ వ్యయంతో తక్కువ సమయంలో పూర్తి చేసే వ్యూహాన్ని రూపొందిస్తున్నట్టు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. డిజైన్లను సీఎం కేసీఆర్‌కు చూపించారు. మెడిటేషన్ మోడల్, క్యాండిల్ ఫ్లవర్ మోడల్, చెట్టు ఆకుల మోడల్, లోటస్ ఫ్లవర్ ఆకారాలతో డిజైన్లను చూపించారు. 11 అంచెలుగా నిర్మాణం చేపడతామని, 25 నెలల్లో పూర్తి చేస్తామని ప్రతిపాదించారు. ప్రాణహిత ప్రాజెక్టు టన్నెళ్లు, పంపు హౌజు డిజైన్లను ఫిబ్రవరి 20 నాటికి అందిస్తామని స్పష్టం చేశారు. మూసీ నదిపై 41 కిలో విూటర్ల మేర ఈస్ట్-వెస్ట్ కారిడార్ నిర్మిస్తామని తెలిపారు. 25 కిలో విూటర్ల మేర స్కైవే, 15 కి.విూ మేర రోడ్ వే ఉంటుందని వివరించారు. ఈ నిర్మాణానికి 40 నెలల సమయం పడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు, రహదారులు, వంతెనలు చాలా వేగంగా నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించిన వ్యూహాన్ని తయారు చేసుకోవాలని చైనా నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సూచించారు. త్వరలో డిజైన్లపై నిర్ణయం తీసుకుని నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. గతంలో జరిగిన సమావేశంలో మూసీ నదిపై బ్రిడ్జిరోడ్డు నిర్మాణం, దుర్గం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం, ప్రాణహిత ప్రాజెక్టు టన్నెళ్లు, పంపు హౌజ్‌ల నిర్మాణానికి చైనా కంపెనీలు ముందుకొచ్చాయి. చైనా బ్రిడ్జెస్ అండ్ రోడ్స్ కార్పొరేషన్ డిజైన్లను రూపొందించింది.