నమో కాలుష్య గంగా! 

గంగానది ప్రక్షాళన, పునరుజ్జీవం కోసమని ప్రధాని మోడీ ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి దాన్ని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉంచింది. కానీ ఏం లాభం? ఇంతవరకూ జరిగిందేవిూ లేదని గంగ దీనిస్థితిని చూస్తే తెలుస్తుంది. పర్యావరణ పరిరక్షణలో జలాశయాలను, నదులను రక్షించు కోవడం అత్యంతావశ్యకం అయినా వాటిని ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని నాలుగేళ్ల మోడీ పాలన చూస్తే తెలుస్తుంది. వారణాసి నుంచి కావాలని పోటికి నిలబడి నమామి గంగే అంటూ హారతులు ఇస్తే కాలుష్యం పోదన్న విషయం నాలుగున్నరేళ్ల పాలన రుజువు చేసింది. కాలుష్యం నుంచి గంగను రక్షించా లని పోరాడిన ఓ యోధుడి మరణం కూడా ప్రధాని మోడీని కదిలించలేకపోయింది. గంగానది పరిరక్షణకోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ  ప్రొఫెసర్‌ అగర్వాల్‌ మరణం అత్యంత విషాదకరంగా ముగిసింది. గంగా ప్రక్షాళన చూడకుండానే ఆయన కన్ను మూసారు. తన జీవితకాలంలో గంగపరిరక్షణ కోసం పలుమార్లు దీక్షలు చేసి, ప్రభుత్వాల మెడలు వంచగలిగిన ఆయన ఈ మారు ఆ పనిచేయలేక ఏకంగా ప్రాణాలే వదలాల్సి వచ్చింది. గంగకంటే ప్రాణం ముఖ్యం కాదని ప్రకటించి, చివరిరోజుల్లో నీటిని సైతం స్వీకరించడం మానివేసిన ఆయన పట్టుదల అనన్యసామాన్యమైనది. గంగ పిలుస్తోందన్నవారు, నమామి గంగే అని మొక్కిన ప్రధాని మోడీని చూశాక ఆయనలో సంకల్ప బలం ఇనుమడించింది. సులభం గానే తన ఆశయా లను నెరవేరుస్తారని ఆయన భ్రమించి ఉంటారు. తన దీక్షకు దిగివచ్చి, తప్పులు సరిదిద్దు కొని గంగపై మరింత మనసుపెడతారని అనుకొనివుంటారు. కానీ అదొక ప్రచారాంశం అన్న సంగతిని గుర్తించలేక పోయారు. ఆయన మరణం పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న వారిని కదిలించిందే తప్ప నమామి గంగా అంటూ ప్రకటనలు ఇస్తున్న వారిని కదిలించలేకపోయింది. స్వామిజ్ఞాన్‌స్వరూప్‌గా పేరు మార్చుకున్న ఈ ఎనభైఆరేళ్ళ పర్యావరణ వేత్త 111రోజులు జరిపిన దీక్షలో ఈ దేశంలోని ఒక ప్రధానమైన నదిని అన్ని బంధనాల నుంచి విముక్తి చేయాలన్న సత్సంకల్పం కార్యరూపం దాల్చకుండానే కన్ను మూయడం విషాదం. ఆయనకున్న పాటి లక్ష్యం మన పాలకులకు లేదని నిరూపితమయ్యింది. నాలుగేళ్ల క్రితం గంగాహారతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ 2019లో జరగబోయే మహాత్మాగాంధీ 150వ జయంతి నాటికల్లా గంగానదిని ప్రక్షాళన చేసి ఆ మహనీయుడి స్మృతికి ఘనంగా నివాళి అర్పిద్దామని పిలుపు నిచ్చారు. అందుకోసం రూ. 20,000 కోట్లు వ్యయం కాగల ‘నమామి గంగ’ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. కానీ నిధుల కేటాయింపు, వ్యయం చేస్తున్న తీరు గమనిస్తే ఆ లక్ష్యం నెరవేరు తుందన్న ఆశ ఎవరికీ కలగదు. నిర్లక్ష్యం కారణంగా దేశంలో అతిపెద్ద నది గంగా ప్రక్షాళన నత్తనడకన  సాగుతోంది. ఇలాగే సాగితే మన గంగను మనం స్వచ్ఛంగా జీవిత కాలంలో కూడా చూడలేం.ఎంతగా అంటే గంగలో మునగాలంటే భయపడాల్సిన దుస్థితి ఏర్పడింది. మానవ తప్పిదాల వల్ల మన జలాశయాలు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. వీటి రక్షణకు బృహత్‌ ప్రణాళిక అవసరం. అలాగే కఠినచట్టాలు కూడా కావాలి. అందుకు సంకల్పబలం కూడా అవసరం. గంగా నదిపై సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) తరచూ ఇస్తున్న ఆదేశాలు మన ప్రభుత్వాల తీరుతెన్నుల్ని ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా నదుల విషయంలో ఇంకా చెప్పించుకునే స్థితిలోనే ఉన్నం తప్ప… ప్రశంసించదగ్గ రీతిలో ప్రభుత్వాలు పనులు చేయడం లేదు. అయిదు రాష్ట్రాల్లో వందల కిలోవిూటర్ల నిడివిలో ప్రవహించే గంగానది కొన్ని దశాబ్దాలుగా కాలుష్యం బారిన పడుతోంది. ఆ నీరు తాగడం మనుషులకు, జంతువులకు హానికరమయ్యే దుస్థితి ఏర్పడింది. తాగడం మాటెలా ఉన్నా కాశీకి లేదా హరిద్వార్‌కు వెళ్లి శుభ్రంగా
గంగస్నానం చేసే అవకాశం లేకుండా పోయింది. హరిద్వార్‌, కనౌజ్‌లాంటి ఘాట్‌లలో నీటిని పరీక్షించి చూస్తే స్నానానికి అది పనికిరాదని తేలింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో, ప్రస్తుతం ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చాక గంగ ప్రక్షాళన కోసం భారీ యెత్తున నిధులు కేటాయించారు.  ఖర్చు చేసిన నిధులు వృధా అయ్యాయని చెప్పడానికి కళ్లకు కనిపిస్తున్న కాలుష్యమే నిదర్శనం. వచ్చే రెండేళ్లలో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ వరకూ గల 543 కిలోవిూటర్ల మేర పురపాలక సంస్థల నుంచి మురుగునీరు, పరిశ్రమల వ్యర్థాలు, చర్మశుద్ధి కేంద్రాల వ్యర్థాలు నదిలో చేరకుండా కఠిన చర్యలు తీసుకోవా లని అధికార యంత్రాంగానికి ఎన్‌జీటీ గతంలోనే  ఆదేశాలిచ్చింది. వ్యర్థాలు నదిలో విడిచిపెట్టే వారికి
రూ. 50వేల మేర జరిమానా విధించాలని సూచించింది. ఈ ఆదేశాలు ఈ ప్రాంతంలోని గంగానదికి మాత్రమే కాదు… దాని ఉప నదులకు కూడా వర్తిస్తాయి. తమ ఆదేశాలను సక్రమంగా అమలు చేస్తే 27 శాతం మేర కాలుష్యం తగ్గుతుందని ఎన్‌జీటీ లెక్కేసింది. హరిద్వార్‌, ఉన్నావ్‌ల మధ్య జనా వాసాల నుంచి 86 మురుగు కాల్వలు ఈ నదిలో కలుస్తు న్నాయి. వందవరకూ పరిశ్రమలున్నాయి. ఈ నది ప్రవహించే అయిదు రాష్ట్రాల్లో వేయి పరిశ్రమలుంటే అవి రోజుకు 50 కోట్ల లీటర్ల వ్యర్థాలను నదిలో విడుస్తున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ వాటి కట్టడిలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. గంగను శాశ్వతంగా రక్షించగలిగే పరిరక్షణ చట్టం కావాలి. పరీవాహకప్రాంతంలో ఇసుక తవ్వకాల నిలిపివేయాలి. స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ ఏర్పాటు ద్వారా గంగా ప్రక్షాళలను చిత్తశుద్దితో శుద్ది చేయాలి. అయితే తన ప్రసంగాల్లో గంగను పదేపదే ప్రస్తుతి స్తున్న ప్రధాని మోదీకూడా కాశీ విశ్వనాధుడి ముందు అబద్దాలు ఆడకుండా ఉండలేకపోయారు.   తనో చిత్తశుద్దిలేని అందరిలాంటి రాజకీయవేత్తనని నిరూపించుకున్నారు. అందుకు ప్రజలుగా మనం చింతించా ల్సిందే తప్ప మోడీలో మాత్రం మార్పు వస్తుందనుకుంటే ప్రోఫెసర్‌ అగర్వాల్‌లా మోసపోగలం.