నయీంతో నేతలకు సంబంధాలు
– ఆధారమిదిగో..
– మీడియాలో మాఫియా ప్రవేశానికి ప్రణాళిక
– విచారణ జరిపితే బడా నేతలు బయటకు
(ఎడమ నుండి కుడికి) ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, టీఆర్‌ఎస్ నాయకుడు దుబ్బాక నరసింహారెడ్డి (వెనకాల), శాలువా కప్పుకొని బురఖాలో ఉన్న వ్యక్తి నయీంగా భావిస్తున్నారు.
హైదరాబాద్,సెప్టెంబర్ 7(జనంసాక్షి):వేషాలు మార్చి మోసాలు చేసిన నరహంతకుడు నయీం నల్గొండ జిల్లాలో పలు రాజకీయపార్టీల నేతలతో సంబంధాలు కలిగిఉన్నాడన్నది బహిరంగ రహస్యమే. తన తమ్ముడి స్మారకార్ధం గత సంవత్సరం వినాయక చవితిని పురస్కరించుకుని ఓ విగ్రహాన్ని నెలకొల్పి ఆ మండపానికి ఆడవేషంలో బురఖా వేసుకుని నయీం వచ్చాడన్న వార్తలు గుప్పుమన్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తూ అప్పటి ఓ ఫైల్ ఫోటో ‘జనంసాక్షి’ కి చిక్కింది. ఈ దిశగా విచారణ జరిపితే నేతలు-నయీం సంబంధాలు బయటపడే అవకాశాలున్నాయి. ఆ రోజు బురఖాలో వచ్చిన వ్యక్తి నయీంమో,కాదో ఆ మండపానికి తాము వెళ్లామో, లేదో కూడా ఆ నేతలే స్పష్టం చేయాల్సి ఉంది. నయీం బతికుంటే ప్రజలు, మీడియా ఆయన గురించి ఇంత స్వేచ్ఛగా మాట్లాడుకొని ఉండేవాళ్లు కాదు. నయీం చావు తరువాత బయట పడుతున్న ఆస్తిపాస్తులు, అరాచకాలు, ఆ ముఠా రచించుకున్న భవిష్యత్ ప్రణాళికలు సామాన్యమైనవి కావు. సాధారణ ప్రజాప్రతినిధులకన్నా ఎంతో దూరదృష్టితో నయీం నేర సామ్రాజ్రాన్ని విస్తృతం చేశాడు. తనమీద ఉన్న వ్యతిరేక ముద్ర (నెగెటివ్ ఇమేజ్)ను చాలా తెలివిగా చెరిపేసుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు.సొంత గొంతు పలికించే మీడియా కంపెనీకి పునాదులు వేసుకున్నాడు. చట్టసభల్లో అడుగు పెట్టి నాయకుడిగా రాణించాలనుకున్నాడు. ఇవన్నీ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి ఉంటే నయీం అనతికాలంలోనే ఎదురులేని శక్తిగా ఎదిగి, రాజ్యాంగేతర శక్తిగా మారేవాడు. నయీంలోని ఏ పార్శ్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించి ఉండేదో ఊహిస్తే ప్రభుత్వ, పాలక వ్యవస్థలు ఇంత దారుణంగా వ్యవహరించి ఉంటాయా అనిపించక మానదు. నయీం చచ్చాడు కాబట్టి ప్రజలు బతికిపోయారు. లేకపోతే మరికొద్ది నెలల్లో అనేక పార్శ్వాలతో కూడిన నయీం గాథలను కథలు కథలుగా వినాల్సి వచ్చేది, చెప్పుకోవాల్సి వచ్చేది. నయీం చేసిన దుర్మార్గాలకు మానవీయ కోణాలు అద్ది ఇదే మీడియా పెద్దలు పుంఖానుపుంఖాలుగా ప్రజల్లోకి వార్తాకథనాలు వదిలేవారు. నయీంను ఒక దశలో తమ అవసరాల కోసం పోలీసులే నేరస్తుడిగా మలిస్తే… అందులో పూర్తిగా ఒదిగిపోయిన నయీం మరో కొత్త పాత్రను పోషించాలనుకున్నాడు. అందులో భాగంగానే ఐ-టెన్ అనే న్యూస్ చానల్‌కు శ్రీకారం చుట్టాడు. నల్లగొండకు చెందిన హరిప్రసాద్‌రెడ్డిని సీఈవోగా నియమించి ఆయన సారథ్యంలో వార్తా ప్రపంచాన్ని ఏలేందుకు పథకం వేసుకున్నాడు. కొంతమంది సిబ్బందికి ఏడాదిపాటు వేతనాలు అడ్వాన్స్‌గా చెల్లించినట్లు సమాచారం. ఎన్‌కౌంటర్ జరక్కపోతే మరికొద్ది నెలల్లో ఆ ప్రయోగం సఫలీకృతమయ్యేదే. అదే జరిగితే నయీంను ఇప్పటిదాకా అరాచక శక్తిగా, నరహంతకుడిగా అభివర్ణించిన మీడియాలో.. దానికి సమాంతరంగా ఆయన్ని మానవతావాదిగా, పెద్దల్ని కొట్టి పేదలకు పెట్టే మరో రాబిన్‌హుడ్‌గా కీర్తించే ప్రత్యామ్నాయ జర్నలిస్టు వర్గం పుట్టుకొచ్చేది. దానికి పునాదులు వేసుకోవడం కూడా ఆయన నల్గొండలోనే ప్రారంభించాడు. గతేడాది నల్గొండలో వినాయక చవితి ఉత్సవాలను ఆయన తమ్ముడి స్మారకంగా నిర్వహించాడు. అదే సంప్రదాయాన్ని ఇకముందు కూడా కొనసాగించాలనుకున్నాడు. జిల్లాలోని అన్ని పత్రికల, న్యూస్ చానళ్ల స్టాఫ్ రిపోర్టర్లకు, ఫొటోగ్రాఫర్లకు నజరానాలు ముట్టజెప్పాడు. టైటాన్ కంపెనీకి చెందిన టైమ్‌వెల్ వాచీలు కొందరికి, వెయ్యి రూపాయలు ఉంచిన కవర్లు మరికొందరికి ఇచ్చుకున్నాడు. మారువేషంలో మీడియా ముందుకొచ్చినా ఆయనే నయీం అన్న విషయం ఎక్కడా పొక్కలేదు. అతనే మారు వేషంలో ఉన్న నయీం అని రిపోర్టర్లు కూడా ఎవ్వరూ బయటికి చెప్పలేదు. ఎంత గోప్యత పాటించారు. నయీం ఆజ్ఞను అక్షరాలా ఎంత క్రమశిక్షణతో పాటించారు. అంతేనా… మావోయిస్టులనే కాదు.. మావోయిస్టు సానుభూతిపరులను కూడా టార్గెట్ చేశాడు. అలాంటివారి సమాచారాన్ని తనకు చేరవేయాలని చెప్పి ఇన్పార్మర్లను కూడా ఏర్పాటు చేసుకున్నట్టు చెబుతున్నారు. మావోయిస్టుల జాడలు ఎంతగా అదృశ్యమైతే తాను అంత భద్రంగా ఉండొచ్చని నయీం ఊహ. అందుకే సానుభూతిపరులను కూడా టార్గెట్ చేసేందుకు విలేకరుల ద్వారా ప్లాను వేశాడు. ఇప్పుడే కాదు.. రేపు ఎప్పుడైనా మావోయిస్టుగా మారే అవకాశం ఉందని భావించిన ఎవరినైనా చంపడం నయీం ఎజెండాలో టాప్ ప్రియారిటీ అంశం.
కొన్ని ప్రసార మాధ్యమాలను నయిం మచ్చిక చేసుకొన్నాడు.కొన్ని మీడియా యాజమాన్యాలకు జీ హుజూర్ అనడానికి అలవాటు పడ్డ సంపాదకులు ఇక నయీం కంపెనీలో ఎలా నోరు దగ్గర పెట్టుకొని పనిచేసేవారో ఊహించడం ఆసక్తిగా ఉంటుంది. వారానికోసారి జరిగే డెస్కు మీటింగుల్లో నయీమ్ ప్రజాసంక్షేమ కార్యకలాపాలను రిపోర్టర్లకు అసైన్‌మెంట్లుగా ఇచ్చేవారు. ఏడాదికో బీద విద్యార్థికి నయీం వెల్పేర్ ఫండ్ నుంచి అందిన సాయం మీద ఆకట్టుకునే టైటిల్స్, హెడ్డర్సు రాసి చానల్లో ప్రసారం చేసేవారు. నయీం కోరుకున్న మావోయిస్టు వ్యతిరేక వార్తలను ఎడిటర్లు దగ్గరుండి ఎడిటింగ్ చేయించేవారు. యాంకర్లకు ఎలా ఎఫెక్టివ్‌గా చదవాలో సూచనలు ఇచ్చేవారు. నయీం ప్రాపకం కోసం ఎక్స్‌ట్రా అవర్స్ డ్యూటీ చేసి సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టు ఫీలయ్యేవారు.
మావోయిస్టులకు ఎక్కడ ఎదురుదెబ్బ తగిలినా దాన్ని పాజిటివ్ వార్తగా మలచేవారు. మావోయిస్టు వ్యతిరేకులతో ఫోన్ ఇన్లు, ప్రత్యేక డిస్కషన్లు నడిపేవారు. ఐ-టెన్ చానల్‌ను పోలీసుల చానల్‌గా భ్రమింపజేసేవారు. రిటైర్డ్ పోలీసు బాసులందరూ ప్రత్యేక చర్చల కోసం నయీం చానల్లో మేకప్ వేసుకొని ప్రిపేరై రెడీగా ఉండేవారు. మావోయిస్టులు ఎంత దేశద్రోహులో, తాము ఎంతమందిని ఏ విధంగా జనజీవన స్రవంతిలో చేరుస్తూ ఉన్నారో పోలీసు బాసులు పోటీలుపడి చెప్పుకునేవారు.
నయీంకు ఉన్న మరో ఆలోచన.. తన జీవితం మీదనే సినిమాలు తీయాలని. అందుకు ప్రణాళికలు కూడా వేసుకున్నాడు. అందుకు అవసరమయ్యే బడ్జెట్ కూడా కేటాయించుకున్నట్టు వార్తల్ని బట్టి తెలుస్తోంది. అది కూడా పూర్తయితే నయీం ఇమేజ్‌ను ఎంతో రమ్యంగా తీర్చిదిద్దేందుకు డైరెక్టర్లు, రైటర్లు, క్రియేటివ్ హెడ్స్ గంటల తరబడి సిట్టింగులు వేసుకునేవారు. రహస్య ప్రదేశాల్లో షూటింగ్‌లు జరిపి నయీంను అతిథి పాత్రల్లో నటింపజేసి భారీ డైలాగులతో కమర్షియల్ హిట్లు సాధించేవారు. నల్లగొండ జిల్లాలోని ఒకటి, రెండు నియోజకవర్గాలను నయీం ట్రస్టు దత్తత తీసుకొని ఉండేది. దాన్ని మరో శ్రీమంతుడు స్థాయిలో తెరకెక్కించేవారు. తెలంగాణ అంతటా నయీం యువసేనలు ఏర్పాటయ్యేవి. నయీం యువసేనల ప్రమేయం లేకుండా అన్ని ఊళ్లలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు సక్సెస్ కాకుండా ఉండేవి. నయీం అజ్ఞాతంలో ఉన్నా ఆయన నిలువెత్తు కటౌట్లు వాడవాడలా ప్రత్యక్షమయ్యేవి. నయీంను అత్యంత పాపులర్ నాయకుడిగా చేసేందుకు మీడియా మేధావులంతా కొత్త ఐడియాల కోసం స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించేవారు.
నయీం బుర్రలో ప్రజాక్షేత్రంలోకి రావాలని, ప్రజానాయకుడిగా చెలామణి కావాలన్న ఆలోచనలే ఉండేవి. ఎన్నాళ్లు ఇలా దొంగచాటుగా బతకడం, ప్రతిక్షణం ఎవరో తనను తరుముతున్నట్టు ఫీలవడం, ఎప్పుడూ 20 మందిని కాపలా ఉంచుకోవడం.. ఛీ… ఏమిటీ బతుకు? నాదీ ఒక బతుకేనా? భీతిగొన్న కుక్కలాగ, బిక్కుబిక్కు పిల్లి లాగ… అని అనిపించడం వల్లనే.. ప్రజాక్షేత్రంలోకి రావాలన్న నిర్ణయం తీసుకున్నాడు. ప్రజాజీవితాన్ని మించిన సురక్షితమైన స్థలం ఎక్కడుంటుంది? మరి అందుకేం చేయాలి? ప్రజలకు దగ్గరవ్వాలి. అందుకని తన ఎజెండాకు విఘ్నాలు కలగరాదన్న ఉద్దేశంతో గణేశ్ నవరాత్రులతో కార్యక్రమం మొదలుపెట్టాడు. తానొక్కడే వెళితే జనాలెందుకు వస్తారు? అందుని తనవెంట ప్రజాప్రతినిధులు కూడా ఉండాలి. వారిని ఎలా రప్పించుకోవాలో నయీంకు బాగా తెలుసు. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, నియోజకవర్గాల ఇన్‌చార్జులను రప్పించుకున్నాడు. మరి వారు ఊరికే వస్తారా? ఏదో నజరానా ముట్టజెప్పాలి. నజరానా ఇచ్చినా చెప్పింది వినకపోతే బెదిరించి లోబరచుకోవాలి. అదే చేశాడు. అందుకే ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా గణేశ్ నవరాత్రుల దగ్గర నయీంతో మీడియా ముందుకొచ్చి నిలబడ్డారు. నయీంకు తమ మద్దతు ఉందన్న విషయం ప్రజలకు తెలియజేశారు. ఒకసారి ప్రజానాయకుడిగా ఎన్నికైతే ఆ కళే వేరు. అధికారం కోసం అంగలార్చే వర్గం ఒకటి ఎప్పుడూ ఉంటుంది. వారిని మేనేజ్ చేయడం చాలా సులువు. అలాంటివారిని ఎంతమందిని కావాలంటే అంతమందిని చెప్పుచేతల్లో ఉంచుకోవచ్చు. ఎవరైనా మాట వినకపోతే.. ఎమ్మెల్యేలైనా సరే వారి భార్యల్ని కిడ్నాపులు చేస్తానని బెదిరించవచ్చు. వారి కొడుకులు, కూతుళ్లను చంపుతానని లోబరచుకోవచ్చు. కాపురంలోని విషయాల్ని బజారుపాలు చేస్తానని కూడా బెదిరించవచ్చు. ఇవన్నీ జరిగాయి కాబట్టే నయీంకు మూడింది.
నయీంతో అంటకాగిన పోలీసు విభాగం గురించి ఎంతయినా మాట్లాడుకోవచ్చు. నయీం ప్రజానాయకుడైతే బహుశా ఏ పోలీసు బాసునూ లెక్క చేసి ఉండేవాడు కాదు. ఇప్పటిదాకా ఖాకీ బట్టలేసుకున్న ప్రతి ఒక్కరికీ (హోం గార్డయినా సరే) ప్రత్యేక విలువ ఇచ్చిన నయీం.. ప్రజానాయకుడైతే మాత్రం పోలీసు బాసులతో ఓ ఆట ఆడుకునేవాడు. వారి గుట్టూమట్లూ తెలిసిన వ్యక్తిగా ప్రతి ఒక్కరినీ వ్యక్తిగత పనుల కోసం వాడుకొని వదిలేసేవాడు. మాట వినకపోతే బ్లాక్‌మెయిల్‌కైనా దిగేవాడు. అది కుదరకపోతే ఖాకీలు తనను ఖాతరు చేయడం లేదని అసెంబ్లీలో గొంతు చించుకునేవాడు. నయీంకు మద్దతుగా మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బల్లలు చరుస్తూ వంతలు పాడేవారు. నయీంకు రాష్ట్ర ప్రభుత్వమే అధికార భద్రతను మరింతగా పెంచి ఉండేది. గ్యాంగ్‌స్టర్‌గా, కిడ్నాపర్‌గా, సెటిల్‌మెంట్లు చేసే బ్రోకర్‌గా, శాడిస్టుగా, వావివరుసలు తెలియని అనాగరిక పిశాచిగా, మీడియా ప్రముఖుడిగా చెలామణిలో ఉన్న నయీంకు మంత్రులు, పోలీసులు, ఎమ్మెల్యేలు, లోకల్ లీడర్లు వంగివంగి సలాంలు కొట్టేవారు. ఇప్పటిదాకా జరిగింది అదే. కాబట్టే నయీం ఆగడాలకు అంతు లేకుండా పోయింది. నువ్వు సీఎంతో చెప్పుకున్నా నిన్నెవరూ కాపాడలేరని రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేందర్‌తో అన్నాడంటే ఎంత ముదిరిపోయాడో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరిగినా పోలీసుల్లోని కొన్ని సెక్షన్లు నయీంకు అన్ని సమాచారాలూ చేరవేశాయంటే పోలీసుల్లో ఎంతమంది ప్రజాద్రోహులున్నారో, ఎంతమంది ప్రభుత్వ పాలనా వ్యవస్థను మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి నయీం చావుతో మన సమాజం ఓ భారీ ఉపద్రవాన్ని తప్పించుకున్నట్టయింది. చాలామంది ప్రజలు బతికిపోయారు. కనీసం పోగా మిగిలిన నక్సలైట్లు అయినా బతికిపోయారు.
అది నయీమే అన్న విషయం నాకు తెలియదు
– ఎమ్మెల్సీ పూల రవీందర్
గతేడాది నల్గొండలో వినాయక చవితి ఉత్సవాల్లో నయీం, ఆయన సోదరితో పాటు పాల్గొన్నవారిలో ఎమ్మెల్సీ పూల రవీందర్ కూడా ఉన్నారు. ఆ ఫొటోలు ఆలస్యంగా వెలుగు చూశాయి. అయితే తాము నయీంతో పాటు పాల్గొన్న విషయాన్ని పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఫోన్‌లో ప్రశ్నిస్తే చాలా ఆలస్యంగా స్పందించిన రవీందర్.. ఆ రోజు ఐదారు గణేశ్ విగ్రహాల వద్ద పాల్గొన్నామని, ముస్లింలే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలియడంతో మత సామరస్యానికి ప్రతీకగా ఉంటుందని తాను భావించానని రవీందర్ చెప్పారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నది నయీం అన్న విషయం తనకు తెలియదన్నారు. మిగతావారికి కూడా తెలియదా అంటే ఆ సంగతి తనకు తెలియదన్నారు. అది ఎవరో ఎంక్వైరీ కూడా చేయాలనిపించలేదా అన్న ప్రశ్నకు అప్పటికే రోజంతా తిరిగి అలసిపోయాం కాబట్టి ఆ ఆలోచన రాలేదన్నారు. నయీంతో పాల్గొన్నవారిపై పార్టీపరంగా చర్యలేవైనా ఉంటాయా అంటే తెలియదని చెప్పారు.




