నరరూప రాక్షసుడు నయీం హతం

.C

– కాకీల కాల్పుల్లోనే ఖేల్‌ ఖతం

మహబూబ్‌నగర్‌/నల్గొండ,ఆగస్టు 8(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌లో కాల్పులు కలకలం రేపాయి. గ్రేహౌండ్స్‌ పోలీసులు, నల్గొండ స్పెషల్‌ పార్టీ పోలీసులు జరిపిన కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్‌ నయీం, అతడి అనుచరుడు మృతిచెందారు. షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌ ఏరియాలో బాషా అనే వ్యక్తి ఇంటిని చుట్టుముట్టి పోలీసులు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో గ్యాంగ్‌స్టర్‌ నయీం సహా మరో దుండగుడు హతమయ్యారు. మిలీనియం టౌన్‌షిప్‌లో 10 మంది వరకు నయీం అనుచరులు తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇక్కడ ఉగ్రవాదులు మకాం వేశారని తెలుసుకున్న పోలీస్‌  అధికారులు సోమవారం ఉదయం ఆ ఇంటిని ముట్టడించి సోదాలు నిర్వహించేందుకు ప్రయత్నించగా కాల్పులకు దారితీయడం, ఆత్మరక్షణార్థం ఆర్మీ అధికారులు కూడా కాల్పులు జరుపడంతో పేరుమోసిన ఉగ్రవాదితో పాటు మరో వ్యక్తి హతమైనట్టు గుర్తించారు. సోమవారం ఉదయం మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ మిలీనియం టౌన్‌షిప్‌లో ఉగ్రవాది మృతిచెందగా మరో ఇద్దరికి అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.  ఆ పరిసర ప్రదేశాల్లోకి తెలంగాణా పోలీసులెవరిని కూడా అనుమతించకుండా ఆపరేషన్‌ పూర్తి చేశారు. కాల్పుల అనంతరం ఇద్దరు మరణించారని గుర్తించారు. గుంటూర్‌కు చెందిన బాషా అనే ఉగ్రవాది షాద్‌నగర్‌ వద్ద ఇంటిలో పదిమంది ఉగ్రవాదులతోకలిసి స్థావరం ఏర్పాటు చేసుకున్నారనే సమాచారం మేరకు గ్రూహౌండ్స్‌ దళాలు  రంగంలోకి దిగారు. పూర్తి ఎన్‌ఐఎ బృందం ఆద్వర్యంలో జరిగిన ఆపరేషన్‌లో పదిమందిని అరెస్ట్‌ చేసినప్పటికి ప్రధాన ఉగ్రవాది ఉన్నాడనుకున్న వ్యక్తి మాత్రం తప్పించుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. కాల్పుల్లో చనిపోయింది కూడా  పేరు మోసిన ఉగ్రవాది నయీంగా బావిస్తున్నారు. ఇదిలా ఉండగా నల్గొండ జిల్లా  భువనగిరికి చెందిన గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ పలుహత్యకేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. వందకుపైగా కేసుల్లో నిందితుడుగా రికార్డు ఉంది. ఐపీఎస్‌ వ్యాస్‌, మాజీ మావోయిస్టు సాంబశివుడు, పటోల్ల గోవర్దన్‌రెడ్డి ల హత్య కేసుల్లో నిందితుడు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందినట్టుగా పోలీసులు ప్రకటించారు. దీంతో గత పదేళ్లకుపైగా సెటిల్‌మెంట్లను చేస్తున్న నయీమ్‌ పోలీసులకు ప్రాణసంకటంగా మారాడు. సోమవారం ఉదయం జరిగిన కాల్పుల్లో నయీం మృతి చెందడంతో ఊపిరి పీల్చుకున్నారు. నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన నయీం 1989లో పీపుల్స్‌వార్‌లో చేరాడు. నక్సలైట్‌గా జీవితం ప్రారంభించిన నయీం అనేక మంది నక్సల్స్‌ నేతలనే హత్య చేశాడు. మావోయిస్టు కార్యకర్త బెల్లి లలితను దారుణంగా హత్య చేసి నయీం తొలిసారి వార్తల్లోకి ఎక్కాడు. తర్వాత పోలీస్‌ కోవర్టుగా మారాడు. వివిధ కేసుల్లో పట్టుబడి 11సార్లు పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. 1993, జనవరి 27 ఐపీఎస్‌ అధికారి కేఎస్‌ వ్యాస్‌ను హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. మాజీ మావోయిస్టు సాంబశివుడు, రాములు, పటోళ్ల గోవర్థన్‌రెడ్డి, పౌరహక్కుల సంఘం నాయకుడు పురుషోత్తమ్‌, అజీంల హత్య కేసుల్లో నయీం ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. హత్యలు భూదందాలు, సెటిల్‌మెంట్లు, బెదిరింపులు ఇలా.. 100కి పైగా కేసుల్లో నయీం నిందితుడిగా ఉన్నాడు. గత కొంతకాలంగా నయీంపై దృష్టి పెట్టిన తెలంగాణ పోలీసులు పక్కా సమాచారంతో ఆపరేషన్‌ చేపట్టి నయీంను మట్టుబెట్టారు. ఇదిలావుంటే  పక్కా సమాచారంతోనే గ్యాంగ్‌ స్టర్‌ నయీంను గ్రేహౌండ్స్‌ పోలీసులు చుట్టుముట్టారని డీజీపీ అనురాగ్‌ శర్మ తెలిపారు. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నయీం గ్యాంగ్‌ షాద్‌ నగర్‌ చేరుకుందని చెప్పారు. మిలీనియం టౌన్‌ షిప్‌ లోని ఇంటిని పోలీసులు చుట్టుముట్టినప్పుడు నయీం గన్‌ మెన్‌ ముందుగా కాల్పులు జరిపాడని వెల్లడించారు. అయితే నయీంతో పాటు ఎవరైనా హతమయ్యారా, ఎవరైనా అరెస్ట్‌ చేశారా అనే విషయాలు వెంటనే వెల్లడి కాలేదు. ఇంకా ఎన్‌ కౌంటర్‌ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. నయీం ముఠాకు చెందిన పలువురు కొద్ది రోజుల క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయారు. హత్య కేసులతో పాటు భూ దందా, సెటిల్మెంట్లు కేసులు కూడా నయీంపై ఉన్నాయి.

నక్సలైట్‌ నుంచి గ్యాంగ్‌స్టర్‌ వరకు

విద్యార్థి నాయకుడి నుంచి గ్యాంగ్‌స్టర్‌ వరకు ఎదిగిన నయీమ్‌ నల్గొండ జిల్లా భువనగిరి నుంచే ప్రస్థానం ప్రారంభించాడు.  1990 పీపుల్స్‌ వార్‌లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. యాదగిరిగుట్టలో పోలీసులపై బాంబు విసిరి పారిపోయేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 1993లో ఎస్పీ వ్యాస్‌ హత్య కేసుతో వెలుగులోకి వచ్చాడు. అనంతరం కొంత కాలం తర్వాత మళ్లీ అరెస్టయి జైలులోనే పీపుల్స్‌వార్‌ వ్యతిరేక కార్యకలాపాలు మొదలు పెట్టాడు. మాజీ నక్సలైట్లు, ప్రజా సంఘాల నేతలు, పౌరహక్కుల నేతల హత్యకేసుల్లో ఏ-1 నేరస్థుడిగా ఉంటూనే తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. భూదందాలు, అక్రమ వసూళ్లు, సెటిల్‌మెంట్లు తదితర నేరాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌ విసిరాడు. దీంతో పోలీసులు నయీంపై ఒత్తిడి తెచ్చేందుకు అతడి అనుచరులపై పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. వీరిలో షకీల్‌ అనే వ్యక్తి మృతిచెందగా.. పాశం శ్రీనివాస్‌, సుధాకర్‌లు అనే నిందితులు ఇటీవల నల్గొండ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొద్దిరోజులకే నయీం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. తండ్రి విద్యుత్‌శాఖలో పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయనకు ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. విద్యాభ్యాసం భువనగిరిలోనే సాగింది. తొలుత ఎస్‌ఎఫ్‌ఐలో కొనసాగిన నయీమ్‌ తర్వాత పీపుల్స్‌ రాడికర్స్‌ స్టూడెంట్‌ యూనియన్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. నయీముద్దీన్‌ అలియాస్‌ భువనగిరి నయీం పేరు చెప్తే హక్కుల సంఘాల నేతలు సైతం ఉలిక్కిపడతారు. రాజకీయ నాయకులూ హడలెత్తిపోతారు. మాజీ నక్సలైట్లకు, మావోయిస్టులకు కంటిపై కునుకుండదు. ఇప్పటికే 40కి పైగా హత్యలు, బెదిరింపుల కేసులతో పాటు లెక్కలేనన్ని సెటిల్‌మెంట్లను తన ఖాతాలో వేసుకుని ఉమ్మడి రాష్ట్ర పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌గా మారిన మాజీ నక్సలైట్‌, ప్రస్తుతం కరుడుగట్టిన నేరగాడు. ఏళ్లుగా పరారీలోనే నేర సామ్రాజ్యాన్ని ఏలుతూ ఒకరకంగా రాష్ట్రం పాలిట దావూద్‌ ఇబ్రహీంలా మారాడు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత అతడిపై ఫిర్యాదులు వచ్చాయి. మూడు దశాబ్దాల క్రితం పీపుల్స్‌ వార్‌లో చేరాడు. వార్‌ అగ్రనేతలు పటేల్‌ సుధాకర్‌రెడ్డి, శాఖమూరి అప్పారావుల వద్ద శిష్యరికం చేసి వారికి సన్నిహితుడిగా మెలిగాడు. నక్సలైట్‌గా జీవితం ప్రారంభించిన నయీం, ఆ తరవాత నక్సల్స్‌ను అంతం చేయడమే తన జీవితాశయమని ప్రకటించాడు! దీనికి సంబంధించి అనేక చోట్ల ప్రదర్శనలను కూడా నిర్వహించాడు. ఈ పరిణామ క్రమంలోనే పోలీసులు నయీంను చేరదీసి తమ అజ్ఞాత కార్యకలాపాల్లో ఉపయోగించడం ప్రారంభించారన్న విమర్శలు ఉన్నాయి. ఓ దశలో కోవర్టుగా మారి నక్సలైట్ల రహస్యాలను పోలీసులకు చేరవేసేవాడని కూడా చెబుతారు. నయీం ఇచ్చిన సమాచారంతోనే అనేక ఎన్‌కౌంటర్లలో పీపుల్స్‌వార్‌, మావోయిస్టు నేతల్ని ఖాకీలు మట్టుపెట్టారంటారు. కోవర్టు జీవితం గడిపిన నయీం పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి చేతిలో ‘ఆయుధం’గా కూడా మారాడు. చట్ట పరిధిలో చేయలేని అనేక పనుల్ని పోలీసులు అతడితో చేయించుకుంటారని వినిడికి. ఇదే అతడి బలంగా మారిందని కూడా కొందరు అధికారులంటారు. నయీంకు కొందరు పోలీసులే సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సొహ్రాబుద్దీన్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసులో నయీం కోసం గుజరాత్‌ పోలీసులతో పాటు సీబీఐ కూడా గాలించింది. కానీ వారెవరికీ అతని జాడయినా తెలియలేదు. నయీం చేసిన అనేక దారుణ హత్యల్ని ఇప్పటికీ పోలీసులే మర్చిపోలేరు. అజ్ఞాతంలో ఉండగానే భువనగిరిలో బెల్లి లలిత దారుణ హత్యతో నయీం పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగింది. గ్రేహౌండ్స్‌కు ఆద్యుడైన ఐపీఎస్‌ అధికారి కేఎస్‌ వ్యాస్‌ హత్య కేసులోనూ ఇతను నిందితుడు. ఈ కేసు 14 ఏళ్ల తరవాత కోర్టులో వీగిపోయింది. పౌర హక్కుల నేతలు పురుషోత్తం, కరుణాకర్‌లను పట్టపగలే తెగనరికిన కేసుల్లో కూడా నయీం పాత్ర సుస్పష్టం. మరో నేత ఆజం అలీనీ చంపినట్లు ఆరోపణలున్నాయి. మాజీ మావోయిస్టులు గణేశ్‌, ఈదన్న హత్య వెనకా నయీమే మాస్టర్‌మైండ్‌ అని పోలీసులు చెప్తుంటారు. ఎల్‌బీ నగర్‌కు చెందిన రియల్టర్‌ రాధాకృష్ణ, మాజీ మావోయిస్టు నేత, టీఆర్‌ఎస్‌ నాయకుడు కె.సాంబశివుడు, రివల్యూషనరీ పేట్రియాటిక్‌ టైగర్స్‌ (ఆర్పీటీ) వ్యవస్థాపకుడు పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి… ఇలా అనేక దారుణ హత్యలకు నయీం, అతడి గ్యాంగ్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయాయి. అనేక కోర్టుల్లో నయీంపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. నయీం నేరాలు చేయించే స్టైల్‌, ఆ తరవాత సదరు నిందితులు అరెస్టయ్యే విధానం ఆద్యంతం పక్కాగా ఉంటాయి. అందుకే ఏ కేసులోనూ పోలీసులు నయీంకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరించలేకపోతున్నారు. సైబరాబాద్‌, హైదరాబాద్‌లకు చెందిన కొందరు యువకులను, నేరగాళ్లను చేరదీసి నయీం తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ ముఠా కుట్రల్ని జంట కమిషనరేట్ల పోలీసులు అనేక సార్లు ఛేదించారు.

నయీం ఇళ్లపై పోలీసుల దాడి..సోదాలు

గ్యాంగ్‌ స్టర్‌ నయీం హతమవ్వడంతో పోలీసులు భువనగిరిలో ఆయన ఇంట్లో తనిఖీలు చేశారు. ఇద్దరు డీఎస్పీలు, నలుగురు ఏఎస్పీలు తనిఖీల్లో పాల్గొన్నారు. నయీం ఇంట్లో భారీగా నగదు ఉన్నట్టు సమాచారం. నయీం ఇంటిచుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండల పరిధిలో పోలీసులు సోదాలు చేసి నయీం అనుచరులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. నయీం అనుచరుల ఇంట్లో కోట్లాది రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. రెండు కౌంటింగ్‌ మిషన్లతో డబ్బును లెక్కిస్తున్నారు. పోలీసులు రెండు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక వ్యవహారాలకు నయీం ఈ ఇంటిని అడ్డాగా వాడుకున్నట్టు భావిస్తున్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా షాద్‌ నగర్‌ వద్ద జరిగిన ఎన్కౌంటర్‌లో నయీం హతమయ్యాడు. గ్యాంగ్‌స్టర్‌ నయీం హతమైన సంఘటనా స్థలాన్ని ఎస్పీ రమా రాజేశ్వరి పరిశీలించారు. పోలీసులు నయీం కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో నయీం భార్య, కూతురు ఉన్నారు. అలాగే నల్లగొండలో గ్యాంగ్‌స్టర్‌ నయీం సోదరి నివాసంలో ఇవాళ పోలీసులు సోదాలు నిర్వహించారు. నయీంకు సంబంధించిన సమాచారం ఏదైనా లభిస్తుందనే భావనతో నల్లగొండలోని ఆమె ఇంట్లో ఈ తనిఖీలు కొనసాగాయి. ఈమేరకు ఎన్‌కౌంటర్‌ అనంతరం పోలీసులు నయీం బంధువులు, అనుచరులకు చెందిన పలుచోట్ల సోదాలు కొనసాగిస్తున్నారు.

నయూం మృతితో పీడ విరగడయ్యింది

మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌, గ్యాంగ్‌స్టర్‌ నయీముద్దీన్‌ అలియాస్‌ నయీం చనిపోవడం ఆనందంగా ఉందని మాజీ మావోయిస్టు సాంబశివుడు తండ్రి చంద్రయ్య అన్నారు. అతడి మృతితో పీడ విరగడయ్యిందన్నారు.  నల్లగొండలో సోమవారం ఆయన మాట్లాడుతూ…నయీం చావడంతో పీడ వదిలిందన్నారు. నయీం అనుచరులను కూడా పోలీసులు మట్టుబెట్టాలని…అప్పుడే దేశం బాగుపడుతుందని చంద్రయ్య చెప్పారు. నల్లగొండ జిల్లాలో 2011లో సాంబశివుడు, 2014లో ఆయన సోదరుడు రాములును నయీం గ్యాంగ్‌ అత్యంత కిరాతకంగా హత్య చేసిందని అప్పట్లో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గ్యాంగస్టర్‌ నయీముద్దీన్‌ హతం కావడం పలువురు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు పెద్ద రిలీప్‌ గా వార్తలు వస్తున్నాయి. నల్లగొండ జిల్లా భువనగిరి ప్రాంతానికి చెందిన నయీం నక్సల్స్‌ లోకి వెళ్లి, ఆ తర్వాత క్రిమినల్‌ గా మారి సెటిల్‌ మెంట్లలో , తదుపరి హత్యలలో కీలక పాత్ర పోషించాడు.

నయీమ్‌ పలు చోట్ల నెట్‌ వర్క్‌ ను రూపొందించుకుని దందాలు జరపుతున్న నయీం చాలాకాలంగా దొరకకుండా తిరుగుతున్నాడు.ఈ క్రమంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత టిఆర్‌ఎస్‌ ఎమ్‌ఎల్యేలపై దృష్టి పెట్టాడు.చివరికి టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తనకు చెప్పకుండా నియోజకవర్గాలలో తిరగవద్దని బెదరించాడు.భువనగిరి ఎమ్మెల్యే శేఖర్‌ రెడ్డిని కూడా బెదిరించాడు. కొందరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కెసిఆర్‌ కు ఫిర్యాదు చేయడంతో వారికి ఆయన బులెట్‌ ప్రూప్‌ వాహన సదుపాయం కూడా కల్పించారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్న నేపధ్యంలో నయీం ఎన్‌ కౌంటర్‌ కు గురయ్యాడు. అయితే కెసిఆర్‌ ఆదేశాల మేరకు నయూం అక్రమాలపై పోలీసులు నిఘా పెట్టి ఎన్‌కౌంటర్‌ చేశారని తెలుస్తోంది.

గంగారామ్‌ ఫిర్యాదుతో నయీం ఆచూకీ వెల్లడి

నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి జెడ్‌పీటీసీ భర్త గంగాధర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో గ్యాంగ్‌స్టర్‌ నయీం జాడను పోలీసులు కనుగొని వెంటాడారని తెలుస్తోంది. గంగాధర్‌ను పోన్‌లో బెదిరించిన నయూం కోటి రూపాయలు డిమాండ్‌ చేయడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా ట్రాక్‌ చేసి నయీం షాద్‌ నగర్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కోటి రూపాయలు ఇవ్వాలంటూ నయీం ముఠా గత జూలైలో గంగాధర్‌ను  బెదిరించింది. దీంతో ఆయన గత నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నయీం ముఠా కదిలికలపై నిఘా వేయడంతో పాటు ఫోన్‌ కాల్స్‌ను ట్రాక్‌ చేశారు. వాళ్లు షాద్‌నగర్లో ఉన్నట్టు పక్కాగా సమాచారం వచ్చింది. నయీం ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, అతని అనుచరుడు కాల్పులు జరిపాడు. పోలీసులు ఎదురుకాల్పులు జరపగా నయీం హతమయ్యాడు. అయితే గత నెలలో గంగాధర్‌కు ఫోన్‌ చేసి కోటి రూపాయాలు ఇవ్వాలని బెరిరించారు. అంతేగాకుండా డబ్బులు ఇవ్వకుంటే ఖతం చేస్తామని హెచ్చరించారు. దీంతో బెంబేలెత్తిన గంగాధర్‌ పోలీసులను ఆశ్రయించడంతో నయూం ముఠా కోసం గాలింపుచర్యలు చేపట్టారు.