నలుగురితో న్యాయమూర్తులతో సీజేఐ భేటీ

– 15నిమిషాల పాటు సాగిన చర్చలు
న్యూఢిల్లీ, జనవరి18(జ‌నంసాక్షి) : సర్వోన్నత న్యాయస్థానంలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు నలుగురు అసమ్మత సీనియర్‌ న్యాయమూర్తులతో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ దీపక్‌ మిశ్రా గురువారం భేటీ అయ్యారు. కోర్టు ప్రారంభమవడానికి ముందు జస్టిస్‌ మిశ్రా.. న్యాయమూర్తులు చలమేశ్వర్‌, రంజన్‌ గొగోయ్‌, మదన్‌ లోకూర్‌, కురియన్‌ జోసఫ్‌తో సమావేశమయ్యారు. దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ భేటీ జరిగిందని కోర్టు వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో ఇతర న్యాయమూర్తులెవరూ పాల్గొనలేదని లేదని తెలిపాయి. వాస్తవానికి బుధవారమే ఈ సమావేశం జరగాల్సి ఉండగా.. జస్టిస్‌ చలమేశ్వర్‌ అస్వస్థతతో సెలవు తీసుకోవడంతో వాయిదా పడింది. అయితే చలమేశ్వర్‌ మినహా మిగతా ముగ్గరు న్యాయమూర్తులు రంజన్‌, కురియన్‌, మదన్‌ లోకూర్‌లతో సీజేఐ నిన్న కొద్ది సేపు భేటీ అయ్యారు. అయితే నేటి భేటీలో ఏం జరిగిందన్నది ఇంకా తెలియరాలేదు. సుప్రీంకోర్టు పాలనా వ్యవస్థ సరైన క్రమంలో లేదంటూ జనవరి 12న నలుగురు అత్యంత సీనియర్‌ న్యాయమూర్తులు విూడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారి. ఈ సందర్భంగా సీజేఏ మిశ్రాపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.