నలుగురు ఉగ్రవాదుల హతం


ఎదురు కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి
3
ఇంటర్నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌: పంజాబ్‌లో మరో సారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శనివారం తెల్లవారుజామున పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. సైనిక దుస్తుల్లో ఎయిర్‌బేస్‌ వాహనంలో వచ్చిన నలుగురు ముష్కరులు ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రతిఘటించాయి. ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందగా, మరో ఇద్దరు వైమానిక స్థావరంలోకి ప్రవేశించారు. భద్రతా బలగాలు వేటాడి మరో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. ఉగ్రవాదులతో జరిగిన పోరులో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. మరో ఆరుగురు సైనికులు గాయపడ్డారు. దాడులకు పాల్పడింది జైష్‌-ఎ-మహ్మద్‌ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు. వైమానిక స్థావరం ధ్వంసమే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. పఠాన్‌కోట్‌లో నిన్న గురుదాస్‌పూర్‌ ఎస్పీ సల్వీందర్‌సింగ్‌ కారులో వెళ్తుండగా సాయుధులు అపహరించారు. ఎస్పీ అపహరణ ఘటనతో ఉగ్రవాదులకు సంబంధముందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉగ్రదాడుల నేపథ్యంలో పంజాబ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైఅలర్ట్‌ ప్రకటించిన అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

6 నెలల వ్యవధిలో ఇది రెండోసారి
పంజాబ్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడటం 6నెలల వ్యవధిలో ఇది రెండో సారి. జులై 27న గురుదాస్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌పై ముష్కరులు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు అమరులయ్యారు. భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమించి ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టడంతో ఆపరేషన్‌ ముగిసింది. పంజాబ్‌లో వరుస ఉగ్రదాడులు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

పాక్‌ జాతీయ సలహాదారుతో మాట్లాడనున్న అజిత్‌ ధోవల్‌
ఈ ఘటనపై పాక్‌ జాతీయ సలహాదారుతో భారత జాతీయ సలహాదారు అజిత్‌ ధోవల్‌ మాట్లాడనున్నారు. ఘటన అనంతరం ఉన్నతాధికారులతో ధోవల్‌ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఘటనపై పాక్‌ ప్రభుత్వంతో చర్చలు జరపనున్నట్లు సమాచారం.

శంషాబాద్‌లో అప్రమత్తం
పంజాబ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో శంషాబాద్‌ విమానాశ్రయంలో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. విమానాశ్రయంలో ప్రయాణికులను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.