నల్లజెండాలు ఎగురవేసిన తెలంగాణవాదులు

నిజామాబాద్‌, నవంబర్‌ 1: రాష్ట్రావతరణ దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జర్నలిస్టు ఫోరం, తెలంగాణవాదులు గురువారం చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లా కేంద్రంలో విలేకరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గాంధీచౌక్‌నుండి కలెక్టరేట్‌ వరకు ఊరేగింపు నిర్వహించారు. కలెక్టరేట్‌ వద్ద పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్‌ చేశారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం జిల్లా నాయకులు గణేష్‌, సాయిలు తదితరులను పోలీసులు జీపులో ఎక్కించగా ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. పోలీసుల దౌర్జాన్యాన్ని ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ జేఏసీ జిల్లా చైర్మన్‌ గోపాల్‌శర్మ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రావతరణ దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెలంగాణవాదులు నల్లజెండాలను ఎగురవేశారు.