నల్లడబ్బు వ్యవహారంలో సంస్కరణలకు సిద్దపడాలి
స్వచ్ఛందంగా డబ్బు వెల్లడించే పథకం గత సెప్టెంబర్‌తో గడువు ముగిసిన తరవాత ఇప్పుడు తదుపరి చర్యలపై ఆర్థికశాఖ, ఆదాయపన్ను శాఖలు దృష్టి సారించాయి. తమ డబ్బు లెక్కలను వెల్లడించని నల్లడబ్బున్న వారి ఆరా తసీఏ పనిలో ఉన్నాయని తెలుస్తోంది. ఇలీవల దేశంలో పలువురిపై జరగుతున్న దాడులు ఇందులో భాగంగానే చూడాలి. సెప్టెంబర్ 30 తరవాత తమ బాధ్యత లేదని గతంలోనే ప్రధాని మోడీ ఓ ప్రకటన చేశారు. ఇందుకు అనుగుణంగానే అన్నట్లుగా దాడులు జరగుతున్నాయి. ఇవి మరింతగా ఉంటాయన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గడువు ముగిశాక కఠిన చర్యలుంటాయన్న సంకేతాలు పంపింది. నల్లడబ్బు నిరోధానికి ప్రస్తుతం చలామణిలో ఉన్న 500, వేయి నోట్లను రద్దు చేయాలని ఎపి సిఎం చంద్రబాబు సూచన చేశారు. అయితే ఇది అసాధ్యం కావచ్చు. ఇకపోతే పారదర్శక విధానాలు ముఖ్యం. ఎవరు ఎంతగా సంపాదించినా నిజాయితీగా ఆదాయపన్ను చెల్లించేలా విధానాల రూపకల్పన జరగాలి. స్వల్పమొత్తంలో పన్నులు చెల్లించే విదానం వస్తే ఎక్కువ మొత్తంలో ఆదాయం సమకూరగలదు. ఇబ్బడిముబ్బడి పన్నులు సరికాదని ప్రభుత్వం గుర్తించాలి. అలాగే ప్రతి పైసా బ్యాంకు ద్వారా నగదురహిత కార్యకలాపాలు జరిగేలా చేయాలి. అప్పుడే నల్లడబ్బు పోగుపడదు. డబ్బంతా బ్యాంకుల ద్వారా జమ అయ్యేలా చూస్తే దాచుకునే అవకాశాలు, అవసరాలు రావు. ఆదాయ వెల్లడి కోసం
గతంలో ఇలాంటి పథకాల సందర్భంగా వెల్లడైన నల్లడబ్బుతో పోలిస్తే ఈసారి బయపడింది చాలా ఎక్కువే. జూన్ నుంచి మూడునెలలపాటు అమల్లో ఉన్న ఈ పథకంలో 64,000మంది పౌరులు లెక్కలు చూపని తమ ఆదాయాన్ని వెల్లడించారు. సగటున ఒక్కొక్కరు కోటి రూపాయలు మించి నల్లడబ్బును బయటపెట్టారని చెప్పొచ్చు. ఇది గతంలో అమలు చేసిన క్షమాదాన పథకం లాంటిది కాదని, ఈసారి పన్నుతోపాటు జరిమానా సైతం వసూలు చేశామని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నల్ల ధనం వెల్లడి పథకం గడువు ముగిసిన సెప్టెంబర్ 30 నాటికి రూ. 65,250 కోట్ల డబ్బు స్వచ్ఛందంగా బయటికొచ్చిందని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఇందులో పన్ను, జరిమానాల రూపంలో ప్రభుత్వ ఖజానాకు 45 శాతం అంటే…రూ. 29,362 కోట్లు జమవుతాయి. అయితే ఈ లెక్కలు స్థూలమైనవే. తుది మదింపు తర్వాత వెల్లడైన నల్లధనం మరో పది వేల కోట్ల రూపాయల మేర పెరగవచ్చునని ఆశిస్తున్నారు. ఖజానాకు సమకూడిన ఈ డబ్బును సంక్షేమ పథకాలకు వెచ్చిస్తామని జైట్లీ తెలిపారు. పథకం ముగియడానికి ముందు దాదాపు పక్షం రోజులు ఆదాయపన్ను విభాగం బాగా శ్రమించింది.గతంలో ఒక సందర్భంలో ఇలా ఆదాయ వెల్లడి పథకం అమలైనప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైతే ఇకపై ఇలాంటివి అమలు చేయవద్దని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. లెక్కకు చూపకుండా ఎంతైనా పోగేసు కోవచ్చునని, దాంతో వ్యాపార వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చునని… క్షమాపథకం ఏదైనా అమలు చేసినప్పుడు వెల్లడించి సులభంగా బయటపడవచ్చునని పౌరులు అనుకుంటే దానివల్ల ఒకరకమైన నిర్లిప్త ధోరణి అలవడుతుందని హెచ్చరించింది. అయితే విదేశాల్లో దాగివున్న డబ్బు సంగతేమో కానీ దేశంలో లెక్కలేని సంపద చాలానే ఉందని రుజువయ్యింది. దీనిని ఏదో రూపంలో వెలికి తీయాల్సి ఉంది. దీనికి ఉదారవిధానాలు అమలు చేయాల్సిఉంది. ఆర్థికవేత్తలు ఎప్పుడూ పన్నులు వేసి రాబట్టాలని చూస్తారు. అలాకాకుండా స్వల్పమొత్తంగా పన్నలు చెల్లించేలా చూడాలి. ప్రధానంగా ఉద్యోగవర్గాలను పీడించే పద్దతులు సరిగా
లేవు. ఇక ఈ నల్లడబ్బు గురించి పొంతనలేని అంచనాలే తప్ప శాస్త్రీయమైన లెక్కలు లేవు. స్విస్ బ్యాంకుల్లో రూ. 30 లక్షల కోట్లున్నదని అంచనా వేస్తున్నామని 2011లో ఆనాటి సీబీఐ డెరైక్టర్ చెప్పారు. 2009 ఎన్నికల సభల్లో బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ అది రూ. 75 లక్షల కోట్లుంటుందని చెప్పేవారు. నల్లడబ్బు విషయంలో మన ప్రభుత్వాల ఆలోచన తీరులోనే లోపం ఉన్నదని సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించింది. దాన్ని ఎంతసేపూ పన్ను ఎగవేతగా పరిగణిస్తున్నారు తప్ప దేశ ఆర్ధిక వ్యవస్థను ఛిద్రం చేసే జాతిద్రోహంగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్ధిక నేరాలు, పన్ను ఎగవేతలు, అవినీతి వగైరాల కారణంగా విదేశాలకు లెక్కకు మిక్కిలి డబ్బు తరలిపోతున్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉన్నదని గ్లోబల్ ్గ/నాన్షియల్ ఇంటెగ్రిటీ(జీఎఫ్‌ఐ) బృందం అధ్యయనం వెల్లడించింది. తొలి మూడు స్థానాల్లో చైనా, రష్యా, మెక్సికో దేశాలున్నాయి. ఇలా బయటి దేశాలకు తరలిపోయే డబ్బు భారత్‌లో ఆనాటికానాటికి పెరుగుతున్నదని ఆ బృందం అంటున్నది. ఇది ఏటా దాదాపు లక్ష కోట్లుంటుంద ని నిపుణుల అంచనా. ఏటా వేసే కొత్త కొత్త పన్నులతోపాటే వాటిని రాబట్టడానికి అనుసరించబోయే కొత్త మార్గాలను కూడా ప్రభుత్వాలు అన్వేషిస్తుంటాయి. అయితే ఇలాంటి తిప్పలులేకుండా డబ్బు విదేవౄలకు వెల్లకుండా పథకాలను అమలు చేయాల్సి ఉంది. రియల్‌ఎస్టేట్ లావాదేవీలతోపాటు మద్యం, విద్య తదితర వ్యాపారాల్లో గుట్టలకొద్దీ డబ్బు పోగుపడుతోంది. అదును చూసుకుని సరిహద్దులు దాటుతోంది. చట్టసభలకు జరిగే ఎన్నికలు నల్లడబ్బు చలామణికి రాచమార్గమవుతున్నాయి. పన్నులను పూర్తి స్థాయిలో హేతు బద్ధీకరిస్తే తప్ప పరిస్థితి మెరుగుపడదని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.డబ్బు ఎవరిదైనా, ఎంతయినా బ్యాంకుల్లో వేసుకునే వీలుండాలి. నేలమాళిగల్లో దాచుకునే పద్దతి పోవాలి. బంగారం రూపంలో భద్రపరచుకునే అలవాటు లేకుండా చేయాలి. బ్యాంకులకు ఉన్న డబ్బంతా చేరితే దేశ దరిద్రం తీరుతుంది. ఈ తరహా వ్యవహారాలను తీసుకుని వస్తే తప్ప నల్లడబ్బు అన్న మాటరాదు. లేకుంటే ఎన్నేళ్లయినా,యుగాలు గడిచినా నల్లడబ్బు మాట నడుస్తూనే ఉంటుంది.