నల్లధనం తగ్గిందట! – ప్రధాని మోదీ
దిల్లీ,నవంబరు 8 (జనంసాక్షి): పెద్ద నోట్ల రద్దు చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆర్థిక వ్యవస్థలో నల్లధనం తగ్గించడానికి, పన్ను కట్టేందుకు ముందుకొచ్చే వారి సంఖ్య పెరగడానికి, పారదర్శకతను పెంచేందుకు నోట్ల రద్దు దోహదపడిందని పేర్కొన్నారు. 2016 నవంబర్ 8న చలామణీలోని ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నేటికి నాలుగేళ్లు పూర్తయిన నేపథ్యంలో నోట్ల రద్దు వల్ల ఏర్పడిన లాభాలను వివరిస్తూ పలు గ్రాఫ్‌లను కూడా తన ట్వీట్‌కు జత చేశారు. ట్యాక్స్, జీడీపీ నిష్పత్తి పెరుగుదలకు, ఆర్థిక వ్యవస్థలో నగదు చలామణీ తగ్గడానికి, జాతీయ భద్రతకు నోట్ల రద్దు దోహదపడిందని మోదీ పేర్కొన్నారు.