నవంబర్ 1 కుట్రపూరిత విద్రోహదినం
తెలంగాణ మంత్రులు వేడుకల్లో పాల్గొనవద్దు
చంద్రబాబు, షర్మిళ తెలంగాణపై స్పష్టత ఇచ్చి అడుగుపెట్టాలి
తెలంగాణ మీడియా వివక్షపై ప్రెస్‌కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తాం
టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్, అక్టోబర్ 18 (జనంసాక్షి):
నవంబర్ ఒకటిన జరిగే ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవాలను బహిష్కరించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపునిచ్చింది. నవంబర్ ఒకటిన విద్రోహ దినంగా ప్రకటించింది. గురువారంనాడు తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మీడియాతో మాట్లాడారు. నవంబర్ ఒకటిన నల్లబ్యాడ్జీలు ధరించి, నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలపాలని స్టీరింగ్ కమిటీ నిర్ణయించిందన్నారు. ఈ నిరసన కార్యక్రమాల రూపకల్పనకు జేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ మంత్రులెవ్వరూ అవతరణ వేడుకల్లో పాల్గొనవద్దని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఆ రోజున పాఠశాల విద్యార్థులను అవతరణ వేడుకలకు పంపవద్దని ఆయన కోరారు. తెలంగాణ మంత్రులు కేవలం ఢిల్లీ చుట్టూ తిరగడం కాదు, తెలంగాణ కోసం కార్యాచరణ ప్రకటించాలని సమావేశండిమాండ్ చేసిందన్నారు. అలాగే మంత్రులు ఢిల్లీ నుంచి స్పష్టమైన ప్రకటనతో తిరిగి రావాలని అన్నారు. తెలంగాణ మీడియా పట్ల ప్రభుత్వం చూపిన వివక్షను వారు తమ అధిష్ఠానం దృష్టికి తేవాలని డిమాండ్ చేశారు. అలాగే అధిష్ఠానంతో తెలంగాణవాదులపై నమోదు చేసిన కేసుల అంశాన్ని కూడా చర్చించాలని అన్నారు. తెలంగాణవాదులపై నమోదైన కేసులను ఎత్తివేయించే బాధ్యత తెలంగాణ మంత్రులపై ఉందని ఆయన అన్నారు. తెలంగాణ మీడియా పట్ల ప్రభుత్వ వైఖరిపై ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయాలని సమావేశం నిర్ణయించిందన్నారు. తెలంగాణ మీడియాను అడ్డుకున్న ఘటనను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యుడని సమావేశం తేల్చిందన్నారు. సమైక్యవాదులైన ముఖ్యమంత్రి కిరణ్‌తో పాటు చంద్రబాబునాయుడు, వైఎస్‌ఆర్ సిపి నాయకురాలు షర్మిల తెలంగాణపై స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై స్పష్టత ఇచ్చాకే వారు ఈ ప్రాంతంలో పర్యటించాలని అన్నారు. స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా వారు తెలంగాణలో తిరిగితే నిలదీసే హక్కు ఇక్కడి ప్రజలకు ఉందన్నారు. చంద్రబాబు తెలంగాణ జిల్లాల్లో యాత్రలపై ప్ర జలను చైతన్యవంతులను చేస్తామన్నారు, ఇందుకోసం ఈ నెల 20 నుంచి 22 వరకు మహబూబ్‌నగర్ జిల్లాలో తెలంగాణ జేఏసీ ప్రచారం చేస్తుందన్నారు.