నవంబర్ 4న చలో ఢిల్లీ
నిజామాబాద్, అక్టోబర్ 29 : నవంబర్ నాలుగున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాధర్ తెలిపారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎండగట్టేందుకు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో బహిరంగ సభ జరుగుతుందని, ఈ సభకు జిల్లాలోని మండల, బ్లాక్, సిటీ, నగరానికి చెందిన పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు ఢిల్లీకి వెళ్లనున్నట్టు ఆయన చెప్పారు. అదే విధంగా నవంబర్ 14న రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ భవన్‌లో జరుగుతుందని, ఈ కార్యక్రమానికి మాజీ పిసిసి అధ్యక్షులు శ్రీనివాస్, రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి సుదర్శన్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, పార్లమెంట్ సభ్యులు మధుయాష్కిగౌడ్, ఎమ్మెల్యేలు హాజరవుతున్నారని అన్నారు. నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని వెల్లడించారు. కేంద్రమంత్రి వర్గ విస్తరణలో తెలంగాణకు చెందిన ఇద్దరు అట్టడుగు వర్గాలకు చెందిన పార్లమెంట్ సభ్యులకు మంత్రి పదవి ఇవ్వడం పట్ల ప్రధాని మన్మోహన్, సోనియా, రాహుల్‌గాంధీలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తిరుపతిరెడ్డి, పాండురంగారావు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.