నవాజ్ షరీఫ్‌కు అస్వస్థత
– చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు
రావల్పిండి, జులై23(జనంసాక్షి) : అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అస్వస్థతకు గురైనట్లు రావల్పిండిలోని అడియాలా జైలుకి చెందిన వైద్యుల బృందం తెలిపింది. ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పిన వైద్యులు వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. నవాజ్ షరీఫ్ రక్తంలో యూరియా, నత్రజని స్థాయిలు ప్రమాదకర స్థాయికి చేరినట్లు తెలిపారు. హృదయ స్పందనలో తేడా కనిపిస్తోందని, డీ హైడ్రేషన్ సమస్యతో బాధపడతున్నట్లు వైద్యులు చెప్పారు. జైల్లో షరీఫ్‌కు చికిత్స అందించే వసతులు లేనందున వేరే ఆసుపత్రికి తరలించాలని తాత్కాలిక ప్రభుత్వానికి వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి నిర్ణయం తరువాతనే షరీఫ్‌ను ఆసుపత్రికి తరలించనున్నట్లు అడియాలా జైలు వర్గాలు తెలిపాయి. అవెన్యూ ఫీల్డ్ కేసులో పాకిస్థాన్ కోర్టు నవాజ్ షరీఫ్‌కు పదేళ్లు, ఆయన కుమార్తె మరియంకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.