నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ముంబయి, అక్టోబర్‌19(జ‌నంసాక్షి) : స్టాక్‌ మార్కెట్‌లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. హెచ్‌ 1బీ వీసా
విధానంలో ట్రంప్‌ యంత్రాగం భారీ మార్పులకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు రావడంతో పాటు అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయి. శుక్రవారం ఉదయం 400 పాయింట్లకు పైగా నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం నాటికి సుమారు 600 పాయింట్లకు పైగా నష్ట పోయాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో దలాల్‌ స్ట్రీట్‌ నష్టాల నుంచి కోలుకోలేకపోయింది. శుక్రవారం ఉదయం 408 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సెన్సెక్స్‌ మధ్యాహ్నం రెండు గంటల సమయానికి సుమారు 600 పాయింట్లకు పైగా నష్టపోయింది. రిలయన్స్‌ కంపెనీ, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. చివరి గంటలో మార్కెట్లు కొద్దిగా కోలుకున్నప్పటికీ నష్టాలు మాత్రం తప్పలేదు. సెన్సెక్స్‌ 463.95 పాయింట్లు నష్టపోయి 34,315.63 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 149.50 పాయింట్లు నష్టపోయి 10,303.50 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.49 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో హిందుస్థాన్‌ పెట్రోలియం లిమిటెడ్‌, సన్‌ఫార్మా, వేదాంత లిమిటెడ్‌, కొటక్‌ బ్యాంక్‌, ఐటీసీ స్వల్పంగా లాభపడ్డాయి. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, హెచ్‌సీఎల్‌, యస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు భారీగా నష్టపోయాయి.