నష్టాల నుంచి గట్టెక్కని పిఎన్‌బి

న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): వేల కోట్ల రూపాయల కుంభకోణంలో చిక్కుకున్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు నష్టాల మోత కొనసాగుతోంది. నీరవ్‌ మోడీ పుణ్యమా అని పూర్తిగా మునిగిన పిఎన్‌బి ఇప్పట్లో కోలుకునే సూచనలు కలనిపించడం లేదు. మొండి బకాయిలు పెరగడంతో వరుసగా మూడో తైమ్రాసికంలో ఈ బ్యాంకు నష్టాలను చవిచూసింది. నీరవ్‌ మోదీ మోసం, మొండి బకాయిల వల్ల ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకునేందుకు నిధుల కేటాయింపు చేయాల్సి రావడంతో ఈ తైమ్రాసికంలో కూడా బ్యాంకుకు నష్టం తప్పలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో తైమ్రాసికంలో బ్యాంకు రూ. 4,532.35కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో పీఎన్‌బీ రూ. 561కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం కూడా రూ. 14,205.31కోట్ల నుంచి రూ. 14,035.88కోట్లకు తగ్గింది. స్థూల నిరర్ధక ఆస్తులు 17.16శాతానికి పెరిగి రూ. 81,250.83కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే తైమ్రాసికంలో బ్యాంకు స్థూల నిరర్ధర ఆస్తులు 13.31శాతంగా ఉన్నాయి. నికర నిరర్ధక ఆస్తులు 8.9శాతానికి పెరిగాయి. మొండిబకాయిల కోసం కేటాయించిన ప్రొవిజన్లు ఈ తైమ్రాసికంలో దాదాపు మూడింతలయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం రెండో తైమ్రాసికంలో రూ. 2,693.78కోట్లుగా ఉన్న ప్రొవిజన్లు.. ఈ సారి రూ. 7,733.27కోట్లకు పెరిగాయి. దిద్దుబాటుఏ చర్యలను తీసుకున్నా పెద్ద మొత్తంలో నష్టాలు ఉండడంతో బయటపడడం కష్టమని చెబుతున్నారు.