నాటి తెలంగాణ నేడు ఇవ్వాల్సిందే
ఖమ్మం, జనవరి 19 : 1956లో ఆనాడు హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని నేడు ఇవ్వాల్సిందేనని టిఎన్‌జివోస్ జిల్లా అధ్యక్షుడు రంగరాజు డిమాండ్ చేశారు. కేంద్రం తెలంగాణ ఇస్తామని చెప్పినప్పుడల్లా సీమాంధ్ర నాయకులు గగ్గోలు పెట్టడం సహజమైపోయిందని, వారికి తగదని ఆయన హితవు పలికారు. రకరకాల ప్రచారాలు వారు చేస్తున్నారని, వాటిని తిప్పికొడతామని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన అంశంపై ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నారని, విభజన దిశగా కేంద్రం నిర్ణయం ఉంటుందని తెలుస్తోందన్నారు. ఈ సమయంలో తెలంగాణ మంత్రులపై మరింత ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం భూస్థాపితం కాకతప్పదన్నారు. మంత్రి వెంకట్‌రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న పాలేరులో ఈ నెల 23న తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. దీనికి ఆచార్య కోదండరామ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని చెప్పారు.