వాషింగ్టన్: గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ హోరాహోరీగా తలపడ్డారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ అనూహ్యగా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే వచ్చే అధ్యక్ష ఎన్నికల్లోనూ ట్రంప్‌పై హిల్లరీనే పోటీ చేయాలట.2020లో తనతో మరోసారి తలపడాలంటూ ఆమెపై వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు ట్రంప్. అసలు విషయం ఏంటంటే..2016 అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమికి బయటి శక్తులే కారణమని.. ముఖ్యంగా వికీలీక్స్ వల్లే తాను ఓడిపోయానని హిల్లరీ ఆరోపించారు. హిల్లరీ వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించారు ట్రంప్. ఆమె ఓ బలహీనమైన అభ్యర్థి అని విమర్శించారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ‘నాకు తెలుసు హిల్లరీ మరోసారి పోటీచేస్తారు. హిల్లరీ ప్లీజ్ నాతో మళ్లీ తలపడవా’ అంటూ ఆమెను వెక్కిరించారు.
అంతేగాక ఆమె ఓటమికి అనేక కారణాలున్నాయన్నారు. ఆమె చేసిన వాటిల్లో ఒక్కటి కూడా మంచిపని లేదని ఎద్దేవాచేశారు. జాతీయగీతాన్ని అవమానించిన ఎన్‌ఎఫ్‌ఎల్ క్రీడాకారులను ఆమె సమర్థించడం ఎంతమాత్రం సరికాదన్నారు. హిల్లరీకి దేశమంటే గౌరవం లేదని ఆరోపించారు.