నాన్న తోసేశాడు.. గుర్రపుడెక్కలు రక్షించాయ్!

41467373578_625x300ముంబయి: కన్నతండ్రే బిడ్డను నదిలో పడేసినప్పటికీ అదృష్టవశాత్తు నీటిలోని గుర్రపుడెక్క కారణంగా చిన్నారి ప్రాణాలతో బయటపడిన ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. ఆరేళ్ల చిన్నారి రాత్రంతా ఒంటరిగా నదిలో గడిపింది. బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో థానేలోని బద్లాపూర్‌లోని వాలివ్లి వంతెన వద్ద షూ కొనివ్వమని గొడవ చేస్తున్న పాపను ఆమె తండ్రి మరో స్నేహితుడితో కలిసి వంతెన పై నుంచి ఉల్హాస్‌ నదిలోకి పడేశాడు. వంతెన వద్ద నీటిలో మొత్తం గుర్రపుడెక్క విపరీతంగా పెరిగి ఉండడంతో పాప నీటిలో మునిగిపోకుండా నీటిమొక్కలపై తేలుతూ ప్రాణాలతో బయటపడింది.

వంతెన సమీపంలోని నిర్మాణ సంస్థకు చెందిన సెక్యూరిటీ గార్డ్‌ రమేశ్‌ భోయిర్‌ గురువారం ఉదయం ఆరు గంటలకు విధులకు హాజరయ్యారు. పాప ఏడుపు వినిపిస్తుండడంతో అటూ ఇటూ వెతికి వంతెన వద్దకు వచ్చి కిందకు చూశారు. గుర్రపుడెక్కపై నీటిపై తేలుతూ ఉన్న పాపను చూసి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి పాపను రక్షించి బయటకు తీశారు. బయటకు తీశాక పాపను ప్రశ్నించగా.. తన తండ్రే రాత్రి నీటిలో పడేసినట్లు తెలిపింది. చిన్నారిని ఏక్తా తులసీరామ్‌ సైనీగా గుర్తించారు. కొత్త షూ కొనిస్తానని చెప్పి తండ్రి తనను బయటకు తీసుకొచ్చాడని పాప వెల్లడించింది.

చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పాప తల్లి బుధవారం రాత్రి సైనీ కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్‌, కిడ్నాప్‌ కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. అయితే గురువారం ఉదయం వంతెన వద్ద నదిలో పాప ఉన్నట్లు సమాచారం అందినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాప తండ్రి కోసం గాలిస్తున్నారు.