నాన్‌ డిటెన్షన్‌కి అఖిలపక్షం మొగ్గు

2

హైదరాబాద్‌,సెప్టెంబర్‌12(జనంసాక్షి):

నాన్‌ డిటెన్షన్‌ విధానాన్ని ఎత్తివేయవద్దని మెజార్టీ పార్టీలు సూచించాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ విధానం వల్ల పాఠశాలల్లో డ్రాప్‌ అవుట్లు పెరుగుతాయని అందరు అభిప్రాయపడ్డారని వెల్లడించారు. ఇదే విషయం సిఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి? ఆయన అభిప్రాయం తీసుకుని నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. నాన్‌ డిటెన్షన్‌ విధానాన్ని ఎత్తివేయాలా వద్దా అనే అంశంపై హైదరాబాద్‌ లక్డీకాపూల్‌ లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో డిప్యూటీ సీఎం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

అన్ని మోడల్‌ స్కూల్స్‌, కస్తూర్భా రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదువుతున్న అమ్మాయిల భద్రతపై రాష్ట్ర సర్కార్‌ దృష్టి సారించిందని కడియం శ్రీహరి తెలిపారు. ఇవి చాలా వరకు గ్రామాలకు దూరంగా ఉన్నాయని, వీటికి కాంపౌండ్‌ వాల్స్‌, సిసి కెమెరాల ఏర్పాటు, మహిళ ¬ంగార్డులు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఇదే విషయం మొన్న జరిగిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో చర్చించామని కడియం గుర్తుచేశారు. 1971 లో ఉమ్మడి రాష్ట్రంలో నాన్‌ డిటెన్షన్‌ విధానం తీసుకువచ్చారు. రైట్‌ టూ ఎడ్యుకేషన్‌ యాక్టులో కూడ నాన్‌ డిటెన్షన్‌ పాలసీ ఉండాలని తెలిపినట్లు కడియం వివరించారు.పదో తరగతి లోపు ఉత్తీర్ణులు కాని విద్యార్థులను పై తరగతులకు పంపించాలా వద్దా అనే అంశంపై రాష్ట్రాల అభిప్రాయాన్ని కోరుతూ గత నెలలో కేంద్రం లేఖ రాసింది. దేశవ్యాప్తంగా విద్యాప్రమాణాలు మెరుగు పరిచి? నూతన విద్యా విధానం అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో గత నెల 19న సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డు సమావేశం ఢిల్లీలో జరిగింది. ఇందులో కొన్ని రాష్ట్రాలు నాన్‌ డిటెన్షన్‌ పాలసీని ఎత్తివేయాలని అభిప్రాయపడ్డాయి. దీంతో, కేంద్రం అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కోరుతూ లేఖ రాసింది. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్నీ రాజకీయ పార్టీలతో డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి సమావేశం అయ్యారు.