నార్త్ కొరియా దూకుడును నియంత్రిస్తాం
– మూడవ సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న షింజో
టోక్యో,అక్టోబర్23(జనంసాక్షి) : నార్త్ కొరియా దూకుడును నియంత్రించేందుకు తగిన చర్యలు చేపట్టనున్నట్లు జపాన్ ప్రధాని షింజో అబే తెలిపారు. ఆదివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అబేకు చెందిన కూటమి పార్టీ విజయకేతనం ఎగురవేసింది. దీంతో ఆయన మూడవ సారి జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అణు దూకుడుపై ఆయన తన అభిప్రాయాన్ని వినిపించారు. మూడవ వంతు మెజారిటీతో అబేకు చెందిన కూటమి పార్లమెంట్ ఎన్నికల్లో విక్టరీ సాధించింది. దీంతో ఆయన రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నాలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశ సైనిక దళాలను మరింత బలపరుచాలని అబే విశ్వసిస్తున్నారు. అయితే ఈ అంశంలో ఆయనకు అవరోధాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే తాము నార్త్ కొరియాకు కళ్లెం వేయనున్నట్లు అబే ఇవాళ జరిగిన విూడియా సమావేశంలో పేర్కొన్నారు. వచ్చే నెలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జపాన్‌లో పర్యటించనున్నారు. అయితే అప్పుడు నార్త్ కొరియా అంశాన్ని ట్రంప్‌తో చర్చించనున్నట్లు అబే తెలిపారు. రష్యా, చైనాలతోనూ ఈ అంశాన్ని ప్రస్తావించనున్నట్లు ఆయన తెలిపారు. పదేపదే అణుపరీక్షలతో బెంబేలెత్తిస్తున్న నార్త్ కొరియాపై బలమైన ఒత్తిడి తీసుకురానున్నట్లు అబే చెప్పారు. జపాన్ ప్రజల రక్షణను తాను కోరుతున్నట్లు ఆయన తెలిపారు. అబేకు చెందిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీపీ).. కొమిటో పార్టీతో కలిసి.. దిగువసభకు మొత్తం 465 స్థానాలకు గాను 313 స్థానాలను గెలుచుకున్నది. ఈ మెజారిటీతో రాజ్యాంగాన్ని సవరించేందుకు అబే సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది.