నాలుకా..తాటిమట్టా..
వ్యవసాయచట్టాలు మళ్లీ తెస్తాడట!
` కేంద్రమంత్రి తోమర్ వ్యాఖ్యలు
` ఒక అడుగు వెనక్కి వేశామే తప్ప వెనకడుగు వేయలేదని వెల్లడి
ముంబై,డిసెంబరు 25(జనంసాక్షి):సాగుచట్టాలపై కేంద్రమంత్రి తోమర్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరిన్ని సవరణలతో తిరిగి చట్టాలను తీసుకుని వస్తామంటూ ప్రకటన చేశారు. ఇటీవల రద్దు చేసిన సాగు చట్టాలను మళ్లీ తెస్తామంటూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సంచలన ప్రకటన చేశారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మహారాష్ట్ర లో జరిగిన ఓ కార్యక్రమంలో తోమర్ మాట్లాడుతూ.. రైతుల మేలు కోసం ఒక్క అడుగు వెనక్కి వేశామని, భవిష్యత్తులో మళ్లీ ముందుకు వెళ్తామని తెలిపారు. వ్యవసాయ చట్టాలను స్వల్ప మార్పులతో మళ్లీ తెస్తామని ప్రకటించారు. ఢల్లీి సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు వారం క్రితమే శిబిరాలను ఖాళీ చేసి వెళ్లారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి తోమర్ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. స్వల్ప మార్పులతో చట్టాలు తిరిగి తీసుకొస్తామని తెలిపారు. రైతుల కోసం ప్రధాని ఎంతో చేశారని వివరించారు. 70 ఏళ్లలో ఎవరు చేయని పనిని మోడీ చేశారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతుల ఆందోళనతో ప్రభుత్వం గత నెలలో మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంది. అయితే ఈ చట్టలను ప్రవేశపెట్టవచ్చని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మహారాష్ట్రలో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. మేము వ్యవసాయ సవరణ చట్టాలను తీసుకువచ్చాము. అయితే కొంతమందికి ఈ చట్టాలు నచ్చలేదు. స్వాతంత్యర్ర వచ్చిన 70 సంవత్సరాల తరువాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇది పెద్ద సంస్కరణ అని వ్యవసాయ మంత్రి అన్నారు. కానీ ప్రభుత్వం నిరాశ చెందలేదు. మేము ఒక అడుగు వెనక్కి తీసుకున్నాం. రైతులు భారతదేశానికి వెన్నెముక కాబట్టి మేము మళ్లీ ముందుకు సాగుతామని చెప్పారు.