నాలుగున్నరేళ్లు ప్రజారంజక పాలన అందించాం

– ఆపద్దర్మ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
– అల్లోల సమక్షంలో టీఆర్‌ఎస్‌ లో పలువురు చేరిక
నిర్మల్‌, సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్ళుగా సాగుతున్న ప్రజరంజక పాలనకు.. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సఫలీకృతమైందని ఆపద్దర్మ గృహ నిర్మాణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సమక్షంలో నిర్మల్‌ నియోజకవర్గంలోని లక్ష్మణచాంద మండలం కనకాపూర్‌, సారంగాపూర్‌ మండలం బీరవెల్లి, లోకేశ్వరం మండలం మన్మడ్‌ గ్రామాలకు, దిలావర్‌ పూర్‌ మండల కేంద్రానికి, నిర్మల్‌ పట్టణానికి చెందిన పలువురు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారందరికి మంత్రి అల్లోల గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ… తెరాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు దేశానికే ఆదర్శం అని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజారంజక పాలన చేస్తోంది అన్నారు. ప్రజలు పాలనను స్వాగతిస్తూ సంతోషంగా ఉన్నారన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు, ఇతర పార్టీలు ఆకర్షితులు అవుతున్నారన్నారు. ప్రజా పాలనకే ప్రజలు మళ్లీ పట్టం కడ్తారని చెప్పారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నిర్మల్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పనితీరు పట్ల, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వ పటిమను చూసి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి సత్యనారయణ గౌడ్‌, యువజన నాయకుడు అల్లోల గౌతం రెడ్డి, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ దేవెందర్‌ రెడ్డి, తదితరులు ఉన్నారు.

తాజావార్తలు