నాలుగు రోజులు రేవంత్‌కు వాయింపు
ఏసీబీ కస్టడీకి అప్పగింత
హైదరాబాద్,జూన్5(జనంసాక్షి): ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టు అయిన రేవంత్‌రెడ్డిని ఇక ఏసీబీ వాయించనుంది. నాలుగురోజుల ఎసిబి కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి ఎసిబి కోర్టు అనుమతించింది. చర్లపల్లి జైలులో ఉంటున్న రేవంత్‌రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహాను విచారించాలన్నా ఏసీబీ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. విచారణ అనంతరం రేవంత్‌రెడ్డి 4 రోజుల కస్టడీకి ఏసీబీకి కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 6న ఉదయం 9 గంటలకు రేవంత్‌ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించాలని కోర్టు ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది సమక్షంలో విచారించాలని కోర్టు షరతు విధించింది. ఈ నెల 9న సాయంత్రం 5 గంటలకు కోర్టు ఎదుట రేవంత్‌ను హాజరుపర్చాలని ఆదేశించింది. అలాగే విచారణలో థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని హెచ్చరించింది. తొలుత శుక్రవారం రేవంత్ రెడ్డి కస్టడీపై విచారణ సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా పడింది. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏసీబీ కోర్టులో ఇరు వర్గాలు వాదనలు వినిపించాయి. వాదనలు విన్న కోర్టు విచారణను సాయంత్రానికి వాయిదా వేసింది. మొత్తానికి ఈ కేసులో 50 లక్షలపై ఆరాతీయాల్సి ఉందని, అవినీతి డబ్బు వ్వయహారం తేల్చాల్సి ఉందని ఎసిబి కోరింది. దీంతో అతడిని ఎసిబి కస్టడీకి అనుమతించారు. ఇదిలవుంటే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 9వ తేదీన విచారణ జరగనుంది. బెయిల్ పిటిషన్‌పై 8వ తేదీన ఏసీబీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనుంది. నోటుకు ఓటు కేసులో కోర్టు రేవంత్ రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటును కొనుగోలు చేసేందుకు రేవంత్ ప్రయత్నించారు. ఆ క్రమంలో ఆయన్ని ఏసీబీ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. సోమవారం ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు. దాంతో రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ నిమిత్తం రేవంత్‌తోపాటు సహ నిందితులు ఉదయ్ సింహ, సెబాస్టియన్‌లను తమ కస్టడీకి అప్పగించాలని కోరగా కోర్టు అనుమతించింది. ఇదిలావుంటే ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని కుట్ర పూరితంగా కేసులో ఇరికించారని ఆయన తరపు లాయర్ సతీష్ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే బలం టీడీపీకి ఉదని ఆయన పేర్కొన్నారు. రేవంత్‌ను 31వ తేదీన అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఒక రోజంతా విచారించారని, మొదటి నుంచి టీ సర్కారు రేవంత్‌ను టార్గెట్ చేసిందన్నారు. మే 28న ఏసీబీ అధికారులకు సమాచారం ఉన్నా మే 31 వరకు ఏం చేశారని సతీష్ ప్రశ్నించారు. వీడియో రికార్డింగ్‌కు రహస్య కెమెరాలు అమర్చారని, టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం అనుమతులు తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారం కుట్ర పూరితంగా ఉందన్నారు. కస్టడీకి ఇస్తే రేవంత్‌రెడ్డి ప్రాణాలకు ముప్పు ఉందని, కస్టడీ పిటిషన్‌లో పేర్కొన్న 4 అంశాలపై స్పష్టత లేదన్నారు. కాల్ రికార్డుల సేకరణకు రేవంత్‌తో పనేంటని ఆయన ప్రశ్నించారు. నాలుగో నిందితుడు మత్తయ్య ఎక్కడున్నాడో కనుక్కోవాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు. పరారీలో ఉన్న వ్యక్తి సమాచారం రేవంత్‌కు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఎక్కడ డీలింగ్ జరిగిందో ఏసీబీకి స్పష్టంగా తెలుసునని, రేవంత్‌ను కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదని సతీష్ వాదించారు. రేవంత్‌రెడ్డి అరెస్టుకు ముందే జరిగిన కేబినెట్ సమావేశంలో కాసేపట్లో బ్రేకింగ్ న్యూస్ వింటారని కేసీఆర్ చెప్పారని, కేసులో ఎవరి పాత్ర ఉందో తమకు తెలుసని ¬ంశాఖ మంత్రి నాయిని అన్నారన్నారు.